హౌసింగ్‌ కార్యాలయాలకు విద్యుత్‌ కష్టాలు | - | Sakshi
Sakshi News home page

హౌసింగ్‌ కార్యాలయాలకు విద్యుత్‌ కష్టాలు

May 21 2026 2:11 AM | Updated on May 21 2026 2:11 AM

బిల్లులు చెల్లించకపోవడంతోసరఫరా నిలిపివేత

గుట్టుగా కొన్ని ఎంపీడీవో కార్యాలయాల నుంచి విద్యుత్‌ కనెక్షన్‌తో పనులు

బిల్లుల చెల్లింపు ఊసెత్తని చంద్రబాబు ప్రభుత్వం

జిల్లాలో మొత్తం హౌసింగ్‌ కార్యాలయాలు 34

వీటిలో 24 మండలాలకు ఏఈ కార్యాలయాలు

నియోజకవర్గ స్థాయిలో 7 డీఈ కార్యాలయాలు

డివిజన్‌ స్థాయిలో ఎగ్యిక్యూటివ్‌ ఇంజినీర్లు 2

నాతవరం: చంద్రబాబు ప్రభుత్వంలో హౌసింగ్‌ ఆఫీసులకు విద్యుత్‌ బిల్లులు చెల్లించక సంబంధిత శాఖ అధికారులు విద్యుత్‌ కనెక్షన్లు కట్‌ చేయడంతో అంధకారంలో హౌసింగ్‌ కార్యాలయాలు దర్శనమిస్తున్నాయి. జిల్లాలో ప్రతి మండలంలో సొంతంగా హౌసింగ్‌ కార్యాలయం ఉండాలన్న ఉద్దేశ్యంతో 2012లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి మండల కేంద్రంలో హౌసింగ్‌ కార్యాలయాలకు నూతన భవనాలు నిర్మించారు, అప్పటి ప్రభుత్వంలో ఇందిరమ్మ పథకంలో దారిద్య్ర రేఖ దిగువనున్న పేదలందరికీ రాజకీయాలకు అతీతంగా హౌసింగ్‌ ఇల్లు మంజూరు చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సైతం హౌసింగ్‌ లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతో మండల కేంద్రంలో గల హౌసింగ్‌ ఆఫీసు నుంచే యఽథావిధిగా లబ్ధిదారులకు అవసరమైన సేవలు అందించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మండల వ్యాప్తంగా అర్హత ఉన్న లబ్ధిదారులకు ఒక్క హౌసింగ్‌ ఇల్లు కూడా మంజూరు చేయలేదు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్లు మంజూరై నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు రెండేళ్లుగా ఒక్క పైసా నేటికీ చెల్లించలేదు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో గల హౌసింగ్‌ కార్యాలయాలకు విద్యుత్‌ బిల్లులు చెల్లించకపోవడంతో వారం రోజుల క్రితం కార్యాలయాలకు అర్ధంతరంగా విద్యుత్‌ శాఖ అధికారులు విద్యుత్‌ సరఫరా నిలుపుదల చేశారు. గత ప్రభుత్వ హయాంలో హౌసింగ్‌ కార్యాలయాలకు కేటగిరి ఒకటి విద్యుత్‌ మీటరు ఉండడంతో ప్రతి నెలా ఒక్కంటికి విద్యుత్‌ బిల్లు రూ.1000 లోపు బిల్లు రావడంతో ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో సంబంధం లేకుండా స్థానిక హౌసింగ్‌ జేఈలు సొంత డబ్బులతో బిల్లులు చెల్లించుకునేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లా వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో ఉన్న హౌసింగ్‌ ఆఫీసులకు విద్యుత్‌ బిల్లులు చెల్లింపునకు ఒక్క పైసా చెల్లించలేదు.

Advertisement
 
Advertisement
Advertisement