తమ్ముళ్ల కుమ్ములాట | - | Sakshi
Sakshi News home page

తమ్ముళ్ల కుమ్ములాట

May 21 2026 2:11 AM | Updated on May 21 2026 2:11 AM

ఆర్‌.భీమవరంలో తారస్థాయికి టీడీపీ నాయకుల వర్గపోరు

మాజీ సర్పంచ్‌,ఎంపీటీసీల మధ్య తీవ్ర వాగ్వాదం

చెరువులో మట్టి తోలకాలను అడ్డుకున్న మాజీ ఎంపీటీసీ

పొలంలో చెట్లు, కరెంట్‌ వైర్లు ధ్వంసం చేసిన మాజీ సర్పంచ్‌

బుచ్చెయ్యపేట: మండలంలో గల ఆర్‌.భీమవరం గ్రామంలో టీడీపీ నాయకుల వర్గపోరు తార స్థాయికి చేరింది. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ మలిరెడి బుజ్జి, మాజీ ఎంపీటీసీ వెలంకాయల అప్పలనాయుడు మధ్యన తీవ్ర వర్గపోరు, దాడులతో ఆర్‌. భీమవరం,శివారు గ్రామం చిన భీమవరం రెండు గ్రామాల్లో ప్రజలు భయందోళనలు చెందుతున్నారు. మంగళవారం రాత్రి మాజీ ఎంపీటీసీ వెలంకాయల అప్పలనాయుడు ద్విచక్ర వాహనంపై వస్తుండగా మాజీ సర్పంచ్‌ బుజ్జి అతని వర్గీయులు అడ్డుకుని దాడి చేయడానికి ప్రయత్నించారు. బుధవారం మాజీ ఎంపీటీసీ వెలంకాయల అప్పలనాయుడు కుమారుడు వెలంకాయల గోవింద నాయుడుకు చెందిన భూమిలో కొబ్బరి చెట్లను, ఫెన్సింగ్‌ను, విద్యుత్‌ స్తంభాలను పొక్లెయిన్‌తో మాజీ సర్పంచ్‌ బుజ్జి, అతని వర్గీయులు తొలగించారు. సుమారు 20 కొబ్బరిచెట్లు తొలగించగా పోలీసులు రంగ ప్రవేశం చేసి అడ్డుకున్నారు. వీరిద్దరికి కొద్ది కాలంగా గొడవలు జరుగుతున్నాయి. మాజీ ఎంపీటీసీ అప్పలనాయుడు కుటుంబ సభ్యులకు జాతీయ ఉపాధి హామీ పథకం డబ్బులు రాకుండా మాజీ సర్పంచ్‌ మలిరెడ్డి బాజ్జి ఆపు చేయడంపై ఇరువురు గతంలో వాగ్వాదానికి దిగారు. మంగళవారం మాజీ సర్పంచ్‌ బుజ్జి గ్రామానికి చెందిన స్వామియాజులు చెరువులో పొక్లెయిన్‌, ట్రాక్టర్లతో మట్టి తోలుతుండగా మాజీ ఎంపీటీసీ అప్పలనాయుడు తహసీల్దార్‌ లక్ష్మికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహారానికి చెందిన మాజీ సర్పంచ్‌ బుజ్జి మంగళవారం రాత్రి ద్విచక్ర వాహనంపై వస్తున్న మాజీ ఎంపీటీసీ అప్పలనాయుడిపై దౌర్జాన్యానికి దిగడంతో ప్రాణ భయంతో ఆయన పారిపోయారు. బుధవారం మాజీ ఎంపీటీసీ అప్పలనాయుడు కుటుంబంకు చెందిన భూమిలో కొబ్బరి చెట్లను, ఫెన్సింగ్‌ను, విద్యుత్‌ స్తంభాలను మాజీ సర్పంచ్‌ బుజ్జి పొక్లెయిన్‌తో పడగొట్టించారు. దీనిపై మాజీ సర్పంచ్‌ బుజ్జి అతని వర్గీయులపై మాజీ ఎంపీటీసీ అప్పలనాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్‌ఐ శ్రీనివాసరావును వివరణ కోరగా మాజీ సర్పంచ్‌ మలిరెడ్డి బుజ్జి అతని వర్గీయులపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement