రావికమతం : మండలంలో గర్నికం ఎస్సీ కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు డప్పులు వాయిస్తూ, ఊరేగింపు నిర్వహించి, కుళాయిలకు పూల దండలు వేసి బుధవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఎస్సీ కాలనీలో 30 కుటుంబాల వారు నివాసం ఉంటున్నారు. కాలనీలో జల్‌జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేసినా వాటి ద్వారా నీటి సరఫరా జరగలేదు. కాలనీలో రెండు చేతి బోర్లు ఉన్నాయి. ఒక్క బోరు పూర్తిగా పని చేయకపోగా, మరొకటి మరమ్మతులకు గురైంది. చేతిబోర్ల ద్వారా తాగునీరు అందడంలేదు. దీంతో ఈ సమస్యపై గతంలో ఆందోళన చేపట్టడంతో అధికారులు బోరు బాగు చేయించారు. కానీ ఒక్కరోజు మాత్రమే మంచినీళ్లు వచ్చాయి. తాగునీటి సమస్య పూర్తిగా తీర్చాలని, కాలనీలో రక్షిత మంచినీటి పథకం ఏర్పాటు చేసి నిరంతరం తాగునీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని దళితులు కోరుతున్నారు. ఈ సందర్భంగా బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో డప్పులతో ఊరేగింపు నిర్వహించారు. కుళాయిలకు పూలదండ వేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు గోవిందరావు, కేవీపీఎస్ నాయకుడు సూరిబాబు పాల్గొన్నారు.


