తర్లువాడలో అదానీ గూగుల్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన నిరసన వ్యక్తం చెయ్యకుండా ప్రజల్ని నిర్బంధించిన చంద్రబాబు ప్రభుత్వం పరిహారం చెల్లించకుండానే బలవంతపు భూ సేకరణ రైతుల సమస్యలు పరిష్కరించకుండా శంకుస్థాపన ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్న తర్లువాడ గ్రామస్థులు
రైతుల నిరసన సెగకు భయపడుతూ.. భయపెడుతూ.. ప్రజాస్వామ్యాన్ని పోలీసుల నిర్బంధంలో తొక్కిపెట్టి.. రైతుల కడుపు కొట్టి.. చంద్రబాబు ప్రభుత్వం తర్లువాడలో అదానీ గూగుల్ డేటా సెంటర్‌కు ‘బలవంతపు’ శంకుస్థాపన కార్యక్రమాన్ని మంగళవారం కానిచ్చేసింది. నమ్మిన ప్రజల్ని నట్టేట ముంచే చంద్రబాబు ప్రభుత్వ నైజం తర్లువాడ సాక్షిగా మరోసారి బయటపడింది. కనీసం పరిహారం చెల్లించకుండా, సాగు భూములను లాక్కొని అన్నదాతలను రోడ్డున పడేసిన సర్కారు.. వారు నిరసన తెలపకుండా గ్రామం చుట్టూ పోలీసులను మోహరించి అష్టదిగ్బంధనం చేసింది. రైతుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, వారి గొంతు నొక్కుతూ స్వ ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఇంతలా బరితెగించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఊరంతా పోలీసుల ఆంక్షలు, అరెస్టుల భయం నీడన.. ప్రజలను నిర్బంధించి చేసిన ఈ శంకుస్థాపన పాలకుల నైతిక ఓటమికి నిదర్శనంగా నిలిచింది. మరోవైపు.. శంకుస్థాపన కార్యక్రమం సాక్షిగా.. ‘కూటమి’లో విబేధాలు మరోసారి బట్టబయలయ్యాయి. జనసేన ప్రతినిధులకు ప్రాధాన్యమివ్వకపోవడంతో.. కార్యక్రమానికి హాజరుకాకుండానే వెనుదిరిగారు.
–సాక్షి, విశాఖపట్నం/తగరపువలస/
ఆనందపురం
బయటపడ్డ గంటా..
భరత్ విభేదాలు
అంతేకాకుండా ఈ కార్యక్రమం సందర్భంగా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎంపీ శ్రీభరత్ వర్గాల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. గంటా శ్రీనివాసరావు వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఎంపీ భరత్ ఫొటో లేకపోవడం, ఇరువురు నేతల మధ్య ఉన్న గ్యాప్‌ను స్పష్టం చేస్తోంది. మరోవైపు ఈ భారీ కార్యక్రమం కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు సైతం కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఎండ తీవ్రతకు తాళలేక, కనీసం తాగునీరు కూడా అందక పోలీసులు అవస్థలు పడటం గమనార్హం. ప్రారంభంలో 30 వేల మందితో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావించిన ఈ భూమిపూజ కార్యక్రమం, ఇన్ని వివాదాల మధ్య, ఆశించిన స్థాయిలో కాకుండా చప్పగా ముగిసింది.
ఆనందపురం మండలం తర్లువాడలో మంగళవారం జరిగిన గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ భూమిపూజ కార్యక్రమం అధికారిక వేడుక కంటే, రాజకీయ ప్రదర్శనగా మిగిలిపోవడంతో పాటు అనేక వివాదాలకు కేంద్రబిందువైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వంటి అగ్రనేతల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక తర్లువాడ గ్రామస్తులకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. తమ భూములను ప్రాజెక్టు కోసం ఇచ్చిన రైతులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందజేయకుండానే భూమిపూజ చేపట్టడాన్ని నిరసిస్తూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతులలో ఉన్న ఈ అసంతృప్తిని దృష్టిలో ఉంచుకుని, పోలీసులు ముందస్తు చర్యల పేరుతో గ్రామస్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. కార్యక్రమం పూర్తయ్యే వరకు గ్రామస్తులను బయటకు రానీయకుండా నిర్బంధించడం, జాతీయ రహదారి నుంచి వ్యవసాయ భూముల వరకు ఎక్కడికక్కడ పికెటింగ్ నిర్వహించి కదలికలను ఆంక్షలకు గురిచేయడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం పరిపాలనాపరమైన ప్రోటోకాల్‌లను సైతం పక్కన పెట్టి, పూర్తిగా అధికార పార్టీ కార్యక్రమంలా సాగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత ప్రజాప్రతినిధులైన ఎంపీపీ మజ్జి శారదా ప్రియాంకను, జెడ్పీటీసీ సభ్యుడు కోరాడ వెంకటరావును కనీసం ఆహ్వానించకపోవడం ప్రోటోకాల్ నిబంధనల ఉల్లంఘనకు నిదర్శనంగా మారింది. టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్ బీఆర్‌బీ నాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు తాట్రాజు అప్పారావును తప్ప చీమను కూడా గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ వైపు రానివ్వలేదు. వీరికి బదులుగా ఎలాంటి పదవుల్లో లేని మాజీ సర్పంచ్, మండల పార్టీ అధ్యక్షుడికి ప్రాధాన్యత ఇస్తూ పాస్‌లు జారీ చేయడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అటు కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు కూడా ఈ కార్యక్రమంలో సరైన గుర్తింపు దక్కలేదనే వాదన వినిపిస్తోంది. భీమిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కురిమిన రామస్వామినాయుడుకు ఆహ్వానం అందకపోవడంతో ఆయనతో పాటు వచ్చిన రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పంచకర్ల సందీప్ ఆ కార్యక్రమం నుంచి వెనుదిరిగారు.


