అయ్యన్న కనుసన్నల్లోనే అనుచరుల అరాచకాలు
తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రులు
దాడికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి
ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నాయకులు
నర్సీపట్నం : స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు అనుచరులైన టీడీపీ గూండాలు మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్‌పై దాడికి పాల్పడడం అమానుషమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే గణేష్‌ను అమర్నాథ్, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మాజీ ఎమ్మెల్యే కరణం ధర, జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు, మాజీ ఎమ్మెల్యేలు మలసాల భరత్‌కుమార్, చింతల వెంకట రామయ్య కలిసి గణేష్ కుటుంబానికి, పార్టీ శ్రేణులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ పెద్దలు బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర కన్వీనర్ కురసాల కన్నబాబు జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారన్నారు. స్పీకర్ సృష్టి క్షేత్రం పేరుతో నర్సీపట్నం పెద్ద చెరువులో చేపడుతున్న అక్రమ నిర్మాణాల వల్ల రైతులకు ఇబ్బందులు తలెత్తడం వల్ల గణేష్ కోర్టును ఆశ్రయించారన్నారు. కోర్టు స్టే ఇచ్చినప్పటికీ ధిక్కరణకు పాల్పడుతూ చెరువులో పనులు చేస్తుండడంతో ఆ మార్గంలో వెళ్తూ మాజీ ఎమ్మెల్యే గణేష్ కారు దిగి పరిశీలించారన్నారు. ఆ సమయంలో స్పీకర్ అనుచరులైన రౌడీషీటర్లు, గంజాయి నిందితులు, కర్రలు, కత్తులు పట్టుకుని కేకలు వేస్తూ గణేష్, అతని పీఏపై దాడి చేయడాన్ని రాష్ట్రమంతా చూసిందన్నారు. రాళ్లతో కారు అద్దాలను ధ్వంసం చేసి, గణేష్‌పై దాడికి యత్నించడం దారుణమన్నారు. బలమైన ప్రతిపక్ష నాయకుడైన గణేష్‌ను నిలువరించేందుకు దాడికి పాల్పడ్డారన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 24 మాసాల్లో 21 మంది వైఎస్సార్‌సీపీ నాయకులను దారుణంగా హత్య చేశారన్నారు. 710 మందిపై హత్యలు, 3,500 అక్రమ కేసులు బనాయించారన్నారు. రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు..మా నాయకులు ఏది చేస్తే అదే రాజ్యాంగం అన్న విధానంలో చంద్రబాబు ఉన్నారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తుంటే హోం మంత్రి విహార యాత్రలు చేస్తున్నారన్నారు. మీ దురాగతాలను ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడతారా అని మండిపడ్డారు. పోలీసులు చర్యలు తీసుకోకపోతే కార్యాచరణ రూపొందించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. పార్టీలో ఎవరికి కష్టమొచ్చినా పార్టీ అండగా నిలబడుతుందన్నారు.
దాడుల సంస్కృతి సరికాదు...
మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ రాజకీయాల్లో ఆరోపణలు చేసుకోవడం సహజం, దాడులకు తెగబడే సంస్కృతి ఉత్తరాంధ్రలో ఎప్పుడూ లేదన్నారు. స్పీకర్ కనుసన్నల్లోనే గణేష్‌పై దాడి జరిగిందన్నారు. ఘటనపై స్పీకర్ స్పందించకపోవడమే బలమైన సంకేతాన్ని ఇస్తుందన్నారు. కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ నిర్మాణాలు చేపట్టడం దారుణమన్నారు. మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ గణేష్‌పై దాడికి కుట్ర చేయడం దారుణమన్నారు. ఇదే సంస్కృతి కొనసాగిస్తే స్పీకర్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
పోలీసులకు ఫిర్యాదు
మాజీ ఎమ్మెల్యే ఉమాశఽంకర్ గణేష్‌పై దాడికి పాల్పడిన ధనిమిరెడ్డి మధు, కట్టా నాగు, ఇట్టంశెట్టి మల్లేశ్వరరావు, కటారి తాతబాబు, బండారు సంతోష్, చింతల గణేష్ ధనిమిరెడ్డి మల్లిబాబు, ఉప్పలపు గోవిందు మరికొంత మందిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


