వీసీపై ఏఎంఎస్, డీహెచ్‌పీఎస్ ఆగ్రహం
సీతంపేట: ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది వేడుకల్లో రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావును ఆహ్వానించి, వేదిక మీదకు పిలవకుండా అవమానపరచడం దారుణమని అంబేడ్కర్ మెమోరియల్ సొసైటీ(ఏఎంఎస్) అధ్యక్షుడు బొడ్డు కళ్యాణరావు ధ్వజమెత్తారు. రామాటాకీస్ రోడ్డులోని అంబేడ్కర్ భవన్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గొల్ల బాబూరావు ఏయూ పూర్వ విద్యార్థి అని, ఆహ్వాన పత్రికలో పేరు ముద్రించినప్పటికీ వేదికపైకి ఆహ్వానించకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఈ ఘటనకు ఏయూ వీసీ ప్రొఫెసర్ రాజశేఖర్ బాధ్యత వహించాలని, ఆయనను వెంటనే పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. డీహెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జె.వి.ప్రభాకర్ మాట్లాడుతూ.. ఘన చరిత్ర కలిగిన ఏయూ వందేళ్ల పండగ ఏ ఒక్కరికో సొంతం కాదని, ఇది కేవలం టీడీపీ కార్యక్రమంగా జరపడం సరికాదని విమర్శించారు.


