లారీ ఢీకొని ఇద్దరు యువకుల దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని ఇద్దరు యువకుల దుర్మరణం

Apr 29 2026 8:06 AM | Updated on Apr 29 2026 8:06 AM

● బయ్యవరం వద్ద దుర్ఘటన ● స్నేహితులతో కలిసి బైక్‌లపై యానాం వెళుతుండగా ఘటన

కశింకోట : మండలంలోని బయ్యవరం వద్ద సోమవారం అర్థరాత్రి దాటాక జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. బంధువుల పెళ్లికి అగనంపూడి నుంచి బైక్‌పై యానాం వెళుతుండగా వెనుక నుంచి లారీ ఢీకొని వెళ్లిపోవడంతో ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడినవారిని విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. సీఐ అల్లు స్వామినాయుడు అందించిన వివరాల ప్రకారం...అగనంపూడికి చెందిన నంబారు అజయ్‌ (20), ఓడూరు అఖిల్‌ (25) సహా మరో నలుగురు యువకులతో కలిసి మూడు బైక్‌లపై కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో జరిగే బంధువుల వివాహానికి సోమవారం రాత్రి బయలుదేరారు. వారు మండలంలోని బయ్యవరం రైల్వే స్టేషన్‌ రోడ్డు వద్దకు చేరే సరికి వారిలో ఒకరి బైక్‌ను వెనుక నుంచి గుర్తు తెలియని లారీ వచ్చి ఢీకొని వెళ్లిపోయింది. దీంతో అజయ్‌, అఖిల్‌ తీవ్రంగా గాయపడగా వారికి అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స జరిపించి వాహనంలో వారిని విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందారు. మృతదేహాలకు కేజీహెచ్‌లో పోస్టుమార్టం జరిపించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతులు చదువుకొని ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదంలో బైక్‌ దెబ్బతింది. ప్రమాదానికి కారణమైన లారీని జాతీయ రహదారిపై సీసీ కెమెరాల ఫుటేజీల సహాయంతో గుర్తించి ఖమ్మం వద్ద పట్టుకొని స్వాధీనం చేసుకొని ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. ఎస్‌ఐ లక్ష్మణరావు కేసును దర్యాప్తు చేపట్టారు. ఎస్‌ఐ మనోజ్‌ కుమార్‌ కేసుకు సహకరించారు.

చేతికి అందివస్తారనుకుంటే...అనంతలోకాలకు...

ప్రమాదంలో మృతి చెందిన అఖిల్‌ అగనంపూడి కాలనీకి చెందిన వాడు. విశాఖ జీవీఎంసీలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఓడూరి అప్పారావు, వరలక్ష్మి దంపతుల ఏకై క మగ సంతానం. మరో నలుగురు కుమార్తెలున్నారు. వారికి వివాహం అయింది. అఖిల్‌కు ఇంకా వివాహం కాలేదు. కశింకోట పాలిటెక్నిక్‌ కళాశాలలో డిప్లమో, ఐటీఐ చదివి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో తమ కుటుంబానికి చేదోడుగా ఉంటాడనుకున్న కుమారుడు అఖిల్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం కుటుంబాన్ని తీవ్రంగా కలచి వేసింది. మరో మృతుడు నంబారు అజయ్‌ కూడా అగనంపూడి బీసీ కాలనీకి చెందిన వాడు. తండ్రి అచ్చిబాబు తాపీ మేస్త్రిగా పని చేస్తున్నాడు. తల్లి లక్ష్మి గృహిణి. వీరికి ఒకే మగ సంతానం. ఆడపిల్లకు వివాహం అయింది. ఇంటర్మీడియట్‌ చదివి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా ప్రమాదంలో లోకాన్ని వీడి వెళ్లిపోవడంతో తమ కుటుంబానికి అండ లేకుండా పోయిందని వారు రోదిస్తుండడం చూపరులను కంట తడి పెట్టించింది.

ఓడూరు అఖిల్‌

నంబారు అజయ్‌

Advertisement
 
Advertisement
Advertisement