పరవాడ: అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అదేశాల మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు 100 రోజుల అవగాన కార్యక్రమం కొనసాగుతోంది. దీనిలో భాగంగా మండలంలోని గొర్లివానిపాలెం జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో ప్రజలకు మంగళవారం అవగాహన కల్పించారు. ఈసందర్భంగా సీఐ మల్లికార్జునరావు మాట్లాడుతూ గ్రామాల్లో గంజాయి వినియోగం, సరఫరా మార్గాలు, సంబంధిత వ్యక్తులపై సమాచార సేకరణ చేపడుతున్నట్లు తెలిపారు. గంజాయి సేవించేవారిని కౌన్సెలింగ్ ద్వారా సంస్కరించి, అవసరమైతే డి–అడిక్షన్ కేంద్రాలకు పంపిస్తామని పేర్కొన్నారు. సరఫరాదారులపై ప్రత్యేక నిఘా ఉంచి, ఆకస్మిక దాడులు నిర్వహిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పునరావృత నేరస్తులపై పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి గ్రామానికి ఒక కానిస్టేబుల్/హెడ్ కానిస్టేబుల్‌ను నియమించి నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐతో పాటు ఎస్‌ఐ భీమరాజు, సిబ్బంది పాల్గొన్నారు.


