కోర్టు ఆదేశాలను ధిక్కరించి నర్సీపట్నం పెద్ద చెరువులో అక్రమంగా పనులు లారీలను అడ్డగించిన మాజీ ఎమ్మెల్యే గణేష్ గణేష్ కారు ధ్వంసం, ఆయన పీఏపై టీడీపీ రౌడీ మూకల దాడి
సాక్షి, అనకాపల్లి: నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనుచరుల అరాచకాలు పెరిగిపోతున్నాయి. న్యాయస్థానం ఉత్తర్వుల ఉల్లంఘనకు పాల్పడుతూ నర్సీపట్నం మున్సిపాలిటీ పెద చెరువులో చేపడుతున్న సృష్టి క్షేత్రం నిర్మాణ పనులను అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ నర్సీపట్నం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కారు ధ్వంసం చేయడమే కాకుండా, ఆయన పీఏపై అయ్యన్న అనుచరులు, టీడీపీ రౌడీ మూకలు దాడి చేశారు. వివరాలోకి వెళితే..కోర్టు స్టే ఉన్నప్పటికీ నర్సీపట్నం పెద్ద చెరువులో అక్రమంగా జరుగుతున్న సృష్టి క్షేత్రంలో పనులను అడ్డుకునేందుకు మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ సోమవారం రాత్రి వెళ్లారు. ఎమ్మెల్యే కారు చెరువు గర్భంలోకి వెళ్లే మార్గంలో ఆపి ఉంది. ఆ సమయంలో ఆయనతో పీఏ, ఇద్దరు నాయకులు మాత్రమే ఉన్నారు. ఇంతలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనుచరులు, టీడీపీ మూకలు పెద్ద చెరువు వద్దకు చేరుకున్నారు. కారు ఎందుకు అడ్డం పెట్టావు.. అంటూ వీరంగం సృష్టించారు. పోలీసుల సమక్షంలోనే మాజీ ఎమ్మెల్యే గణేష్‌పైకి దూసుకు వచ్చేందుకు యత్నించారు. దీంతో అప్పటికే అక్కడకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే అనుచరులు, టీడీపీ వారి మధ్య మాటల యుద్ధం నెలకొంది. టౌన్ ఎస్‌ఐలు రమేష్, ఉమామహేశ్వరరావు అక్కడకు చేరుకుని ఇరువర్గాలను సముదాయించి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. మాజీ ఎమ్మెల్యే గణేష్‌ను కారు ఎక్కించారు. ఈ క్రమంలో టీడీపీ మూకలు రెచ్చిపోయి గణేష్ కారు అద్దాలు ధ్వంసం చేశారు. టీడీపీ వారు రెచ్చిపోయినప్పటికీ మాజీ ఎమ్మెల్యే గణేష్ శాంతం వహించారు. పోలీసులు వారించడంతో ఇరువర్గాల వారు అక్కడ నుంచి వెళ్లిపోయారు.
స్పీకర్‌కు నోటీసులు జారీ..
స్పీకర్‌గా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అయ్యన్నపాత్రుడు కోర్టు ఉత్తర్వులను గౌరవించాల్సింది పోయి, ఆయన ఆదేశాలతో చెరువులో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. కోర్డు ఆదేశాలను పక్కాగా అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోలేదు. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి స్టే ఉన్న చెరువు గర్భంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా చట్టరీత్యా నేరమైనా సృష్టి క్షేత్రం పేరుతో అక్రమ నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఈ నిర్మాణాలతో రైతులకు అన్యాయం జరుగుతుండడంతో వారి అభ్యర్థన మేరకు మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు పెద్ద చెరువులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని ఆదేశించింది. తరుపరి విచారణను జూన్ 17వ తేదీ నాటికి వాయిదా వేసింది. ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్‌తో పాటు వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా ఉన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడికి సైతం కోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు స్టే ఉన్నప్పటికీ చెరువు గర్భంలో యంత్రాలు ఉండడం, ఉపాధి కూలీలతో పనులు చేయించడంపై మాజీ ఎమ్మెల్యే గణేష్ ఇటీవల జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హాకు ఫిర్యాదు చేశారు. ఎలాంటి చర్యలు లేకపోగా చెరువు గర్భంలో అక్రమంగా పనులు ఏర్పాటు చేసేందుకు యంత్రాలు, మెటీరియల్‌ను సిద్ధం చేశారు.
అక్రమ నిర్మాణాలను అడ్డుకుంటే అరాచకమా..!
బాధ్యతయుతమైన పదవిలో ఉన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారు. కలెక్టర్ విజయకృష్ణన్ దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేదు. కోర్టు ఉత్తర్వులను పరిగణరలోకి తీసుకుని ఆర్డీవో ఇరిగేషన్ ఈఈపై చర్యలు తీసుకోవాలని పీజీఆర్‌ఎస్‌లో ఎస్పీకి ఫిర్యాదు చేశాం. ఆర్డీవో, ఇరిగేషన్ అదేశాలతో పనులకు శ్రీకారం చుడుతున్న చెట్టుపల్లి సచివాలయం ప్రభుత్వ సర్వేయర్ శెట్టి రమణ, లైసెన్స్ సర్వేయర్ బోళెం దొర, వీఆర్‌ఏ చెవ్వల నరసింహమూర్తిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరడం జరిగింది. అక్రమ నిర్మాణాల ద్వారా ఆయకట్టుదారుల నోటిలో మట్టి కొట్టేందుకు స్పీకర్ ప్రయత్నిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకుంటే నా పీఏపై అయ్యన్నపాత్రుడు అనుచరులు, టీడీపీ రౌడీలు దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా నా కారును పూర్తిగా ధ్వంసం చేశారు. –మాజీ ఎమ్మెల్యే గణేష్


