మద్దిలపాలెం: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం గూగుల్‌కు దాసోహమైందని సీపీఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు విమర్శించారు. జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డాక్టర్ బి.గంగారావు, వి.కృష్ణారావులతో కలిసి పిఠాపురం కాలనీలోని పార్టీ జిల్లా కార్యాలయం ఏచూరి భవన్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల ఆరోగ్యం, వ్యవసాయం, పర్యావరణం, అడవులు, వన్యప్రాణులను పణంగా పెట్టి 601.40 ఎకరాల భూమి, రూ.22 వేల కోట్ల ప్రజాధనాన్ని గూగుల్ డేటా సెంటర్‌కు కేటాయించారని ఆరోపించారు. పర్యావరణ, అటవీ చట్టాలను ఉల్లంఘిస్తూ అదానీ భాగస్వామ్యంతో గూగుల్ డేటా సెంటర్‌కు శంకుస్థాపనకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమవుతున్నారని విమర్శించారు. ఈ డేటా సెంటర్ వల్ల ప్రత్యక్ష, పరోక్షంగా 1,88,220 ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం ప్రకటించిందని, అయితే ఈఐఏ (పర్యావరణ ప్రభావ అంచనా) నివేదికలో నిర్మాణ దశలో 240, కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత 1,375 ఉద్యోగాలు మాత్రమే వస్తాయని పేర్కొన్నారని చెప్పారు.


