మాడుగుల రూరల్: మాడుగుల పాండవుల చెరువులో ఆక్రమణలను తొలగించి, అభివృద్ధి చెయ్యాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు డి. వెంకన్న, మండల కార్యదర్శి ఇరటా నర్సింహమూర్తి, జిల్లా కార్యవర్గ సభ్యుడు బి.టి. దొర డిమాండ్ చేశారు. సోమవారం వీరు ఇక్కడ చెరువును పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ మాడుగుల మోదమాంబ ఆలయం సమీపంలో సర్వే నంబరు 258లో 11 ఎకరాలు 60 సెంట్లు చెరువు గర్భం కలిగిన పాండవుల చెరువును అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ చెరువులో సగ భాగం ఆక్రమణలు ఉన్నాయని, వాటిని తొలగించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. కూటమి నాయకులు కోట్లాది రూపాయల విలువ చేసే చెరువును కబ్జా చేసి, దాని నుంచి తప్పించుకోవడానికి స్థానిక ఎమ్మెల్యే సహకారంతో మానస సరోవరం పేరుతో నాబార్డు నిధులు రూ. 50 లక్షలతో కొంత మేర అభివృద్ధి చేయడానికి చూస్తున్నారని ఆరోపించారు. దీనిపై సోమవారం కలెక్టరుకు ఫిర్యాదు చేశామన్నారు. ఈ సమస్యకు సంబంధించి, తహసీల్దారు, ఇతర అధికారులు జోక్యం చేసుకోని, చెరువు చుట్టూ ఆక్రమణలను తొలగించిన తర్వాత అభివృద్ధికి సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే స్థానికులతో కలిసి ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.


