వందే | - | Sakshi
Sakshi News home page

వందే

Apr 27 2026 7:36 AM | Updated on Apr 27 2026 7:36 AM

ఏయూ

మద్దిలపాలెం(విశాఖ): ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ ముఖ్య అతిథిగా, క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ప్రత్యేక అతిథిగా హాజరుకానుండటంతో వేడుకలకు విశేష ప్రాధాన్యత ఏర్పడింది. వేదిక ప్రాంగణంలో సుమారు 25 వేల మంది కూర్చునేందుకు వీలుగా మూడు భారీ జర్మన్‌ టెంట్లతో పాటు ప్రత్యేక గ్యాలరీలను సిద్ధం చేశారు. విద్యార్థుల కోసం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాంస్కృతిక ప్రదర్శనలు ప్రారంభం కానుండగా, సాయంత్రం 4 గంటల నుంచి జరిగే ప్రధాన సభలో ఉపరాష్ట్రపతి, సచిన్‌ టెండూల్కర్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తారు. అనంతరం ఏయూ భవిష్యత్‌ ప్రగతికి సంబంధించిన అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరుగుతాయి. సభకు హాజరయ్యే విద్యార్థులు, అతిథుల సౌకర్యార్థం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ప్రతి గ్యాలరీ వద్ద మంచినీటి సదుపాయంతో పాటు భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. భద్రతా తనిఖీలలో భాగంగా మెటల్‌ డిటెక్టర్లను వినియోగిస్తున్నారు. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసిన పాస్‌ ఉన్నవారికే లోపలికి అనుమతి ఉంటుంది. విద్యార్థులందరూ మధ్యాహ్నం 2 గంటల కల్లా ప్రాంగణానికి చేరుకోవాలని ఏయూ వీసీ ఆచార్య జీపీ. రాజశేఖర్‌ ఆదేశించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు వచ్చేందుకు వీలుగా కూర్మన్నపాలెం, పెందుర్తి, సింహాచలం, తగరపువలస, భీమిలి మార్గాల నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక ఉచిత ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. సంబంధిత పాస్‌లను చూపించి ఈ బస్సు సదుపాయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఏయూ యాజమాన్యం సూచించింది.

నేడు విశాఖలో ట్రాఫిక్‌ ఆంక్షలు

అల్లిపురం: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల నేపథ్యంలో సోమవారం నగరంలో భారీ ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ జంక్షన్‌ నుంచి మద్దిలపాలెం ఆర్చ్‌ వరకు రాత్రి 10 గంటల వరకు సాధారణ వాహనాలకు అనుమతి ఉండదు. శ్రీకాకుళం, విజయనగరం నుంచి అనకాపల్లి వైపు వెళ్లే భారీ వాహనాలు ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మార్గాల ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. వీవీఐపీల పర్యటనల సమయంలో జంక్షన్ల వద్ద ట్రాఫిక్‌ నిలుపుదల చేసే అవకాశం ఉన్నందున, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని కోరారు. సభకు వచ్చే విద్యార్థులు, అతిథుల వాహనాల కోసం ఏయూ ప్రాంగణంలో పది ప్రత్యేక పార్కింగ్‌ స్థలాలను కేటాయించారు. విద్యార్థులు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు ధరించాలని, మొబైల్‌ ఫోన్లు తప్ప ఇతర వస్తువులను తీసుకురావద్దని పోలీసులు సూచించారు. వేడుకలు ముగిసిన తర్వాత కూడా వచ్చిన మార్గాల్లోనే తిరుగు ప్రయాణం చేయాలని, ట్రాఫిక్‌ నియంత్రణలో పోలీసులకు సహకరించాలని కమిషనర్‌ విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement