అచ్యుతాపురంరూరల్: విచిత్ర స్థితిలో దుప్పితూరు గ్రామ ప్రజలున్నారని, సమస్యల దిగ్బంధంలో చిక్కు కుని దుర్భరపరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారని విశ్రాంత డీజీపీ జె.పూర్ణచంద్రరావు, ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ (ఏఐబీసీపీ) రాష్ట్ర కోఆర్డినేటర్ బి.పరంజ్యోతి అన్నారు. ఎస్‌ఈజెడ్ నిర్వాసితులతో విశ్వేశ్వర బాబుస్వామి అధ్యక్షతన ఆదివారం దుప్పితూరులో జరిగిన సదస్సులో వారు ముఖ్యఅతిథులుగా మాట్లాడారు. సెజ్ ఏర్పడి 22 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ దుప్పితూరు ప్రజలకు పునరావసం కల్పించలేదని చెప్పారు.సెజ్ అభివృద్ధికి తమ భూములను అప్పగించిన రైతులు దిక్కుతోచని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని చెప్పారు. నిర్వాసితులందరూ ఏకమైపోరాడితే తప్ప సమస్య పరిస్కారం కాదన్నారు. భూసేకరణ సమయంలో నిర్వాసితులకు పునరావాసం కల్పించి, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజ్, కుటుంబానికి రెండు పాడి పశువులు, అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తామని చెప్పి నేటికీ గ్రామాన్ని తరలించకుండానే గ్రామం చుట్టూ బ్రాండిక్స్ కంపెనీ ప్రహారి నిర్మాణ పనులు చేపట్టడం అన్యాయమన్నారు. ఒప్పందం ప్రకారం సేకరించిన వెయ్యి ఎకరాలకు 60వేల ఉద్యోగాలు కల్పించకపోతే ఆ భూమిని తిరిగి ఇవ్వాలన్నారు. ప్రస్తుతం బ్రాండిక్స్ పరిశ్రమలో 23వేల మంది కార్మికులు మాత్రమే విధులు నిర్వహిస్తుండటంతో 600 ఎకరాలను తిరిగి ప్రభుత్వం వెనక్కు తీసుకుని రైతులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. భూములు కోల్పోయిన రైతులకు పరిశ్రమల్లో వాటా దారులుగా చేసుకోవాలన్నారు. పరిశ్రమల వద్ద నిరుపయోగంగా ఉన్న భూములను వెంటనే వెనక్కి తీసుకుని రైతులకు తిరిగి అప్పగించాలని డిమాండ్ చే శారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర బీసీ మహిళా విభాగం కన్వీనర్ ఐ.పరమేశ్వరి, జిల్లా మహిళా విభాగం కన్వీనర్ లక్ష్మి, బీసీ నాయకులు బాల మహేంద్ర, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు దేశంశెట్టి శంకరరావు, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు మాడెం సూరి అప్పారావు, మాజీ పీఏసీఎస్ మాజీ చైర్మెన్ శెట్టి నాగేశ్వరరావు పాల్గొన్నారు.
విశ్రాంత డీజీపీ పూర్ణచంద్రరావు,
ఏఐబీసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ పరంజ్యోతి


