నక్కపల్లి: మండలంలో గొడిచర్లలో విజృంభించిన అతిసార అదుపులోకి వస్తోంది. మూడు రోజుల నుంచి గ్రామానికి చెందిన పలువురు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఆదివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ హైమావతి, డివిజినల్ డెవలప్‌మెంట్ అధికారి మంజుల వాణి, ఎంపీడీవో చలపతిరావు తదితరులు గ్రామాన్ని సందర్శించారు. వాంతులు, విరేచనాలతోబాధపడుతున్నవారి ఇళ్లకు వెళ్లి ఆరోగ్యపరిస్థితిని తెలుసుకున్నారు. బాధితులతోపాటు, గ్రామస్తులు కాచి చల్లార్చిన నీటిని తాగాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గ్రామంలో అన్నివీధుల్లో బ్లీచింగ్, ఫినాయిల్ జల్లించారు. ప్రస్తుతం గ్రామంలో అతిసార అదుపులోకి వచ్చిందని ఆదివారం ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఎంపీడీవో చలపతిరావు తెలిపారు. సచివాలయ సిబ్బందిని,వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. ఈనెల 23నుంచి 25వ తేదీ వరకు మొత్తం 25 అతిసార కేసులు నమోదయ్యాయన్నారు.వీరంతా గొడిచర్ల పీహెచ్‌సీలో చికిత్స పొంది కోలుకున్నారని చెప్పారు.కుళాయినీటిని పరీక్షించారని, లోపాలు ఏమీలేవని నివేదిక వచ్చిందని అధికారులు తెలిపారు.


