అచ్యుతాపురం రూరల్: మండలంలోని దిబ్బపాలెం పంచాయతీ మోటూరుపాలెం గ్రామానికి సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు.సీఐ చంద్ర శేఖర్ రావు, ఎస్‌ఐ సుధాకర్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మోటూరుపాలెంకు చెందిన మదగాల అప్పలరాజు(46) సెజ్ కర్మాగారంలో కలాసీగా పనిచేస్తున్నాడు. మధ్యాహ్నం విధులకు హాజరు కావాలని కబురు రావడంతో బైక్‌పై బయలుదేరాడు. గ్రామ సమీపంలో వాహనం అదుపు తప్పడంతో కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అప్పలరాజును కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. భార్య పార్వతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ చంద్ర శేఖర్ రావు, ఎస్‌ఐ సుధాకర్ చెప్పారు.


