ఇల్లు కూల్చేందుకు యత్నించిన రామునాయుడుపై ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

ఇల్లు కూల్చేందుకు యత్నించిన రామునాయుడుపై ఫిర్యాదు

Apr 27 2026 7:36 AM | Updated on Apr 27 2026 7:36 AM

దేవరాపల్లి: తమ ఇంటిని కూల్చేందుకు స్థానిక టీడీపీ నేత అనుచరుడు, పంచాయతీ పారిశుధ్య కాంట్రాక్టర్‌ దారపురెడ్డి రామునాయుడు యత్నించాడని బాధితుడు ఆతవ ప్రసాద్‌, ఆయన భార్య స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. దేవరాపల్లి సచివాలయం–2 పక్కన ఉన్న తమ ఇంటిలోకి వర్షపు నీరు రాకుండా ఉండేందుకు శనివారం గోడ నిర్మిస్తుండగా పారిశుధ్య కార్మికులతో కలిసి వచ్చిన రామునాయుడు దౌర్జన్యం చేసి గునపాలతో ఇంటి ముందు నిర్మాణాన్ని కూల్చేందుకు ప్రయత్నించాడని పేర్కొన్నారు. వారం రోజుల క్రితం ఇంటికి వచ్చి రూ.50వేలు ఇవ్వాలని, లేకుంటే నిర్మాణాన్ని జరగనిచ్చేది లేదని బెదిరించాడని తెలిపారు. గత్యంతరం లేక అప్పు చేసి రూ.20 వేలు ఇచ్చామని, మిగిలిన సొమ్ము ఇవ్వక పోవడంతో దౌర్జన్యానికి దిగాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే వ్యక్తి గతంలో దేవదాయ శాఖ స్థలంలోని ఉన్న తమ షెలూన్‌ షాపును తొలగింపజేశాడని వాపోయారు. ఏ అధికారం లేకుండా తమ ఇంటిపై దౌర్జన్యం చేసి, బెదిరింపులకు దిగిన రామునాయుడుపై చట్ట పరమైన చర్యలు తీసుకుని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని బాధితులు ఆతవ ప్రసాద్‌, లక్ష్మి దంపతులు కోరారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఇన్‌చార్జి ఎస్‌ఐ లక్ష్మీనారాయణ ఆదివారం విచారణ చేపట్టారు. రామునాయుడుతో పాటు బాధితులను పోలీస్‌స్టేషన్‌కు పిలిచి విచారించారు. అనంతరం ప్రసాద్‌ ఇంటిని పరిశీలించారు. ఇరువర్గాల నుంచి స్టేట్‌మెంట్‌ రికార్డు చేసి దర్యాప్తు చేపడతామని ఎస్‌ఐ లక్ష్మీనారాయణ చెప్పారు.

న్యాయం చేయాలని బాధిత

నాయీ బ్రాహ్మణ కుటుంబం డిమాండ్‌

Advertisement
 
Advertisement
Advertisement