● దేవరాపల్లిలో పారిశుధ్య కాంట్రాక్టర్ రామునాయుడు బరి తెగింపు
● పారిశుధ్య కార్మికులతో కలిసి ఇంటిని కూల్చేందుకు యత్నం
● గునపాలతో కూల్చేయండంటూ హుకుం
● కాంట్రాక్టర్‌పై స్థానికులు, యువకుల తిరుగుబాటు
● తమకు అనుకూలంగా లేరని నాయీబ్రాహ్మణ కుటుంబంపై కక్ష సాధింపు
● ఎండోమెంట్ స్థలంలో ఉన్న సెలూన్ షాపు అన్యాయంగా తొలగింపు
● ఆ స్థలంలో టీడీపీ నేతల అనుచరులకు కేటాయింపు
దేవరాపల్లి: మండల కేంద్రం దేవరాపల్లిలో నిరుపేద నాయీబ్రాహ్మణ కుటుంబంపై శనివారం స్థాని క టీడీపీ నేత అనుచరుడు దౌర్జన్యకాండకు దిగాడు. స్థానిక పంచాయతీలో పారిశుధ్య కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న టీడీపీ నేత అనుచరుడు దారపురెడ్డి రామునాయుడు బరితెగించినాయీబ్రాహ్మణ కు టుంబానికి చెందిన ఇంటిని కూల్చేందుకు యత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. శ్రీకృష్ణ ఆలయానికి సమీపంలోని దేవరాపల్లి సచివాలయం–2 భవనం పక్కన నాయీబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఆతవ ప్రసాద్ తన ఇంటి ముందు భాగంలో వర్షపునీరు ఇంటి లోపలికి రాకుండా నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఇదే అదునుగా భావించి దారపురెడ్డి రామునాయుడు పారిశుధ్య కార్మికులతో కలిసి అక్కడికి చేరుకుని గునపాలతో తవ్వి కూల్చేయాలని హుకుం జారీ చేశాడు. తమ ఇంటిని కూల్చొద్దంటూ బాధితుడు భార్యాపిల్లలతో కలిసి ఇంటి ముందు నిలబడి వేడుకున్నా కనికరించలేదు. అక్కడితో ఆగకుండా కూలుస్తారా లేదా అంటూ పారిశుధ్య కార్మికులపై అరుపులు కేకలతో విరుచుకు పడ్డాడు. దీంతో ఇంటిని కూల్చేందుకు సిద్ధం కాగా, తమను చంపి ఇంటిని కూల్చాలంటూ బాధిత కుటుంబ సభ్యులంతా అడ్డుగా నిలిచారు. ఉద్దేశ పూర్వకంగానే కొంత కాలంగా తమపై కక్ష సాధింపులకు దిగుతున్నాడని వారు కన్నీటి పర్యంతమయ్యారు. మా ఇంటి చుట్టు పక్కల కూడా ఇదే మాదిరిగా నిర్మాణం చేసినా ఎందుకు పట్టించుకోలేదని బాధిత కుటుంబ సభ్యులు భోరున విలపించారు. అధికారులు లేకుండా సంబంధం లేని వ్యక్తి నిరుపేద కుటుంబంపై దార్జన్యానికి దిగడాన్ని చూసిన స్థానికులు, యువకులు రామునాయుడుపై తిరగబడ్డారు. ఏ అధికారంతో ఇంటిని కూల్చుతావంటూ నిలదీశారు. మాకు అధికారి ఆదేశాలు ఇచ్చారంటూ పదే పదే చెప్పడంతో ఏ అధికారి చెప్పారో ఇక్కడి రప్పించండని, అప్పటి వరకు ఇంటిపై చేయి వేస్తే ఊరుకోబోమని రామునాయుడుతో స్థానికులు వాగ్వావాదానికి దిగారు. దీంతో అక్కడ ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బాధిత కుటుంబానికి స్థానికులంతా మద్దతుగా నిలుస్తుండటంతో వివాదం పెద్దది అవుతున్నట్లు గుర్తించిన సదరు వ్యక్తి అధికారులతో ఫోన్‌లో మాట్లాడుతున్నట్లుగా కొద్ది సేపు కాలయాపన చేసి ఆ తర్వాత పారిశుధ్య కార్మికులను వెంట పెట్టుకొని అక్కడి నుంచి జారుకున్నాడు.
అన్యాయంగా సెలూన్ తొలగింపు
నాలుగు రోడ్ల కూడలికి సమీపంలోని దేవదాయశాఖ స్థలంలో ఉన్న ఆతవ ప్రసాద్ సెలూన్ షాపును ఇటీవల అన్యాయంగా తొలగించారు. గత 12 ఏళ్లుగా అదే స్థలంలో సెలూన్ షాపును నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తమకు అనుకూలంగా లేరన్న అనుమానంతో స్థానిక టీడీపీ నేత బాధిత కుటుంబంపై కక్ష సాధింపునకు పూనుకున్నాడు. మూడు నెలల క్రితం సెలూన్ షాపును తొలగించి ఆ స్థలాన్ని టీడీపీకి చెందిన వ్యక్తికి కేటాయించారు. దీంతో నాయీబ్రహ్మణ కుటుంబం రోడ్డున పడింది. పేదల పొట్ట కొట్టే నీచ రాజకీయాలకు దిగడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రామునాయుడుపై చర్యలు తీసుకోవాలి
అధికారుల ఆదేశాల లేకుండా ఇంటిని కూల్చేందుకు దౌర్జన్యానికి దిగిన పంచాయతీ పారిశుధ్య కాంట్రాక్టర్ దారపురెడ్డి రామునాయుడుపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
రామునాయుడుతో వాగ్వాదానికి దిగిన స్థానికులు, ఇంటిని కూల్చొద్దంటూ కన్నీటి పర్యంతమవుతున్న బాధితులు ప్రసాద్, లక్ష్మి దంపతులు
తరుచూ బెదిరింపులు
రామునాయుడు తరుచూ మాపె తరచూ బెదిరింపులకు దిగుతున్నాడు. ఇంటిలోకి వర్షపు నీరు వస్తుందని అడ్డుగా గోడ నిర్మించుకుంటున్నాం. పంచాయతీ అధికారి వచ్చి చూసి సోమవారం పంచాయతీ కార్యాలయానికి రావాలని చెప్పి వెళ్లిపోయారు. రామునాయుడు స్వీపర్లను తీసుకువచ్చి ఇంటిని కూల్చేందుకు యత్నించాడు. లంచం ఇవ్వలేదని రామునాయుడు తమపై కక్ష సాధింపులకు దిగుతున్నాడు. మూడు నెలల క్రితం తమ సెలూన్ షాపును అక్రమంగా తొలగించి మా పొట్టకొట్టాడు. ఇప్పుడు ఇంటిని కూల్చేయాలని కుట్ర పన్నాడు. రామునాయుడు బెదిరింపులు కారణంగానే తన భార్య అనారోగ్యానికి గురైంది. తనకేమి జరిగినా రామునాయుడుదే బాధ్యత.
– ఆతవ ప్రసాద్, బాధితుడు, దేవరాపల్లి.
ఇంటిని కూల్చాలని
ఆదేశాలివ్వలేదు
ఇంటిని కూల్చివేయాలని నేను ఎవ్వరికీ ఆదేశాలు ఇవ్వలేదు. గ్రామానికి చెందిన ఆతవ ప్రసాద్ ఇంటి ముందు భాగంలో అక్రమంగా నిర్మాణం చేస్తున్నాడని స్థానికులు ఫిర్యాదు చేయడంతో శనివారం తాను పరిశీలించాను. సోమవారం పంచాయతీ కార్యాలయానికి ఇంటి పత్రాలు తీసుకురావాలని, అప్పటి వరకు నిర్మాణం చేపట్టవద్దని చెప్పాను. ఇంటిని కూల్చేయాలని పారిశుధ్య కాంట్రాక్టర్ రామునాయుడుకు గాని, పారిశుధ్య కార్మికులకు గాని తాను ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు.
–కె.సుధాకర్‌బాబు, ఇన్‌చార్జి పంచాయతీ
అభివృద్ధి అధికారి, దేవరాపల్లి


