విజృంభించిన
చికిత్స పొందుతున్న
వలస కూలీ గంగరాజు
నక్కపల్లి: మండలంలో గొడిచర్లలో అతిసార వ్యాధి ప్రబలింది. మూడు రోజుల్లో 50 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. ప్రతి ఇంటిలో ఇద్దరు ముగ్గురు చొప్పున అస్వస్థతకు గురై స్థానిక పీహెచ్‌సీతోపాటు, ఆర్‌ఎంపీల వద్ద,తుని, పాయకరావుపేటల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతం గ్రామంలో నల్లల గంగాభవానీ, కె.అప్పలనర్స, కె.అప్పన్న, నల్లల విజయకుమారి, వి.అమ్మాజీ, నల్లల శివరాజు, కొటాని అప్పలనర్స, కొటానిచిన్ని, మాకిరెడ్డి వరలక్ష్మి, చిటికెల చిన్నయ్యనాయుడు, ఒడిసుల లక్ష్మి, నల్లల తేజ,నల్లల మణికంఠ, వారాది కుమారి, గొర్ల చైతన్య, జి. గంగరాజు,టి నాగమణి, నిట్ల అమ్మాజీ, వీధి నూకాలమ్మలతోపాటు, మరి కొంతమంది మంచాన పడ్డారు. ఇంట్లో ఒకరి తరు వాత ఒకరు అస్వస్థతకు గురవుతున్నట్టు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులే కాకుండా పొట్టకూటికోసం అనకాపల్లి పరిసర ప్రాంతలనుంచి గొడిచర్ల సమీపంలో ఉన్న ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు వచ్చిన గంగరాజు, అతని ఆరేళ్ల కుమారుడు మణివివేక్‌లకు కూడా అతిసార సోకింది, వీరు గొడిచర్ల పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నారు. పీహెచ్‌సీకివచ్చిన వారికి వైద్యసేవలందిస్తున్నట్టు డాక్టర్ శ్రావణ సంధ్య తెలిపారు. తమ సిబ్బంది ద్వారా ఇంటింటా సర్వేచేయించామన్నారు. సుమారు16 మంది వాంతులు విరేచనాలతో బాధపడుతున్నట్లు గుర్తించి ఆస్పత్రికి తీసుకు వచ్చి వైద్యం అందించామన్నారు. నీటి శాంపిళ్లను సేకరించి పరీక్షల కోసం పంపించామన్నారు.
కుళాయి నీరే కారణమా?
గ్రామంలో కుళాయిల ద్వారా సరఫరా అవుతున్న నీటిని తాగడం వల్లే వాంతులు విరేచాలు పట్టుకున్నాయని గ్రామస్తులు తెలిపారు.ఉద్దండపురం వద్ద నిర్మించిన వాటర్‌గ్రిడ్ ద్వారా గొడిచర్ల గ్రామానికి తాగునీరు సరఫరా అవుతోంది. గొడి చర్ల హైవేపై ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకుకు సరఫరా చేసి అక్కడనుంచి పైపుల ద్వారా గ్రామంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. మూడు రోజుల క్రితం కుళాయిల ద్వారా వచ్చిన నీటిని తాగినప్పటినుంచి ఈ పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు చెబుతున్నారు. కుళాయిల ద్వారా వచ్చిన నీరు ఆకుపచ్చరంగులో ఉందని, నురగలు తేలుతోందని చెప్పారు. గొడిచర్ల మెయిన్‌రోడ్డు, రామాలయం వీధి, ఎస్సీకాలనీ తదితర ప్రాంతాల్లో నివసించే వారే ఎక్కువగా వాంతులు విరేచనాలతో బాధపడుతున్నారు. పంచాయతీ అధికారులు గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంకును శుభ్రం చేశారు.
గ్రామాన్ని సందర్శించిన ఎంపీడీవో
గొడిచర్లలో అతిసార ప్రబలిన విషయం తెలుసుకున్న ఎంపీడీవో చలపతిరావు, మండల ప్రత్యేకాధికారి, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ తదితరులు గ్రామాన్ని సందర్శించారు. 23వ తేదీనుంచి ఈ లక్షణాలతో బాధపడుతున్నవారి గురించి ఆరాతీశారు.నీటి శాంపిళ్లను సేకరించి గ్రామంలోనే పరీక్షలు నిర్వహించామని ఎటువంటి బ్యాక్టీరియా లేదని నివేదిక వచ్చిందని ఎంపీడీవో తెలిపారు. ఈ లక్షణాలతో చికిత్స పొందుతున్నవారు మరుసటిరోజే పనులకు వెళ్లిపోతున్నారన్నారు. ప్రస్తుతం గ్రామంలో అతిసార అదుపులో ఉందన్నారు. వైద్యసిబ్బందిని అప్రమత్తం చేశామని చెప్పారు. గ్రామంలో ఇంటింటా సర్వే చేస్తున్నట్టు ఆయన తెలిపారు.24గంటలు సిబ్బందినిఅందుబాటులో ఉంచి వైద్య సహాయం అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
గొడిచర్లలో మూడు రోజుల్లో 50 కేసులు
వాంతులు, విరేచనాలతో
ఆస్పత్రుల్లో చేరిక
కుళాయిల ద్వారా వచ్చిన
కలుషిత నీరే కారణమంటున్న బాధితులు


