మాకవరపాలెం: లేబర్ యాక్ట్ ప్రకారం కార్మికుల డిమాండ్లను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ రాజు హామీ ఇవ్వడంతో గత ఐదు రోజులగా చేస్తున్న ఆందోళనను శనివారం విరమించి పయినీర్ కార్మికులు విధుల్లో చేరారు. 8 గంటలు మాత్రమే తమతో పనిచేయించాలని, సకాలంలో వేతనాలు చెల్లించడంతో పాటు మరికొన్ని సమస్యలు పరిష్కరించాలని మంగళవారం నుంచి విధులు బహిష్కరంచి ఆందోళన బాటపట్టారు. ఈ ఆందోళన శనివారం ఐదో రోజు కొనసాగింది. ఈ నేపథ్యంలో పరిశ్రమ హెచ్‌ఆర్ జీఎం ఉపేంద్రరెడ్డి పోలీసుల సమక్షంలో కార్మికులతో చర్చలు జరిపారు. అనంతరం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ రాజు కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కార్మికుల డిమాండ్లపై చర్చించి 8 గంటల పనితోపాటు పరిశ్రమ లోపల క్యాంటీన్ సౌకర్యం కల్పించేలా చూస్తామన్నారు. పీఎఫ్, ఈఎస్‌ఐ, మెడికల్ లీవ్, పే స్లిప్‌లు అందిచే ఏర్పాటు చేస్తామన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు స్కిల్ సర్టిఫికెట్లను బట్టి అప్‌గ్రేడ్ చేయిస్తామన్నారు. వారం రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో కార్మికులంతా చర్చించుకుని విధుల్లో చేరారు.
సీఐటీయూ నేతల అరెస్ట్
పయినీర్ పరిశ్రమ వద్ద ఆందోళన చేస్తున్న కార్మికులకు మద్దతుగా నిలిచిన సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు జి.కోటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శంకరరావు, కార్యదర్శి రాజులను పోలీసులు శనివారం ఉదయం అరెస్టు చేసి, గొలుగొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం సాయంత్రం వారిని విడుదల చేశారు. కార్మికుల న్యాయమైన సమస్యల పరి ష్కారం కోసం మద్దతు తెలిపితే ఇలా అరెస్ట్‌లు చేయ డం అన్నాయమని సీఐటీయూ నాయకులు అన్నారు.
అసిస్టెంట్ లేబర్ కమిషనర్
రాజు హామీతో విధుల్లో చేరిక


