నిరసనల మంటపై
మిడ్డే మీల్
సాక్షి, అనకాపల్లి : రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం పేద మహిళల పొట్ట కొట్టేందుకు సిద్ధమైంది. మధ్యాహ్న భోజన పథకంలో ‘స్మార్ట్ కిచెన్’ పేరుతో కొత్త విధానాన్ని తీసుకొచ్చి, ఏళ్ల తరబడి వంట చేస్తున్న పేద మధ్యాహ్న భోజన కార్మికులను సాగనంపేందుకు కుట్ర పన్నుతోంది. ఆధునికీకరణ ముసుగులో ఈ పథకాన్ని బడా కంపెనీలకు ధారాదత్తం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో జిల్లావ్యాప్తంగా పనిచేస్తున్న 2,400 మంది వంట కార్మికుల భవిష్యత్తు అంధకారంలో పడనుంది. దీంతో ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ మధ్యాహ్న భోజన కార్మికులు శనివారం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేసి.. అనంతరం తమ డిమండ్లను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.
మహిళా కార్మికుల గుండెకోత..
గ్రామాల్లోని పేద, మధ్యతరగతి మహిళలు ఎన్నో ఏళ్లుగా అతి తక్కువ గౌరవ వేతనంతో పాఠశాల విద్యార్థులకు రుచికరమైన భోజనం వండి పెడుతున్నారు.
ఇప్పుడు ‘స్మార్ట్ కిచెన్’ల పేరుతో సెంట్రలైజ్డ్ కిచెన్లను ఏర్పాటు చేసి, స్థానిక మహిళలను తొలగించాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా వారి ఉపాధిని దెబ్బతీసి, కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చాలని చూస్తోంది. ‘మా కడుపు కొట్టి బడా కంపెనీలకు పెడతారా?’ అంటూ మహిళా కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నాణ్యతపై ప్రశ్నార్థకాలు
ఎక్కడో ప్రైవేట్ వంటశాలల్లో వండిన భోజనం గంటల తరబడి ప్రయాణం చేసి బాక్స్‌ల్లో పాఠశాలలకు చేరుకోవడంలో నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. తాజా భోజనానికి బదులు నిల్వ ఉంచిన పదార్థాలు విద్యార్థులకు పెట్టడం వల్ల వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. కేవలం కంపెనీల కమీషన్ల కోసం విద్యార్థుల ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు.
కుట్రను తిప్పికొడతాం
స్మార్ట్ కిచెన్ల పేరుతో తమను విధుల్లో నుంచి తొలగిస్తే సహించేది లేదని కార్మికులు హెచ్చరిస్తున్నారు. ఆధునిక పరికరాలు కావాలంటే తాము పనిచేస్తున్న పాఠశాల వంటశాలల్లోనే ఏర్పాటు చేయాలని, అంతేకానీ వంట బాధ్యతలను థర్డ్ పార్టీ సంస్థలకు అప్పగించవద్దని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడకపోతే కలెక్టరేట్ ముట్టడిని మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే విద్యాశాఖ కార్యాలయాలను స్తంభింపజేస్తామని పిలుపునిచ్చారు. తమ ఉపాధిని కాపాడుకునేందుకు ఎంతటి పోరాటానికై నా సిద్ధమని వంటమ్మలు భీష్మించుక కూర్చున్నారు. అయితే, మే 1 నాటికి ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో వంటలు నిలిపివేసి సమ్మెకు దిగుతామని కార్మికులు స్పష్టం చేశారు.


