రైతుల సమస్యలు గాలికొదిలేసిన ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

రైతుల సమస్యలు గాలికొదిలేసిన ప్రభుత్వం

Apr 25 2026 7:30 AM | Updated on Apr 25 2026 7:30 AM

గోవాడ ఫ్యాక్టరీని తెరిపించి, రైతులు, కార్మికుల బకాయిలు చెల్లించాలి

రైతు ఉద్యమానికి వైఎస్సార్‌సీపీ సిద్ధంగా ఉంది

విలేకరుల సమావేశంలో శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ

చోడవరం : రైతులు, ప్రజల సమస్యలను కూటమి ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందని మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. చోడవరంలో శుక్రవారం జరిగిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. దోచుకోవడం ప్రధానంగా చంద్రబాబు పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అనారోగ్యం నుంచి తొందరగా తేరుకోవాలన్న ఆయన ఐటీ మంత్రి, ముఖ్యమంత్రి రాష్ట్రంలో ప్రజల సమస్యలు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఎంతో బాగా నడుస్తున్న గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీని ఎందుకు మూసివేశారని, రైతులకు, కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.39కోట్లు రెండేళ్లుగా ఎందుకు చెల్లించలేదని బొత్స ధ్వజమెత్తారు. 24 వేల మంది చెరకు రైతుల జీవనాధారమైన గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీని మూసివేయడమే కాకుండా రైతుల చెరకు బకాయిల కోసం రూ.39 కోట్లు కనీసం ప్రభుత్వం ఇవ్వకపోవడం కూటమి ప్రభుత్వానికి రైతుల పట్ల ఎంతటి నిర్లక్ష్యం కనబరుస్తుందో అర్ధమౌతోందన్నారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రూ. 89 కోట్లు సాయం చేసి రైతులను, ఫ్యాక్టరీని ఆదుకున్నామన్నారు. రైతుల బకాయిలు చెల్లించడంతో పాటు ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్‌ చేస్తూ అవసరమైతే వైఎస్సార్‌సీపీ చెరకు రైతుల తరపున పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. చెరకు బదులు మొక్కజొన్న వేయాలని సూచిస్తున్న స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలు ఆ మొక్కజొన్నకు సైతం గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆవేదన చెందుతున్నా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గోవాడ ఫ్యాక్టరీని తెరిపించడంతోపాటు రైతులందరికీ అండగా ఉంటామని చెప్పారు. గీతం కాలేజీ అక్రమ కట్టడాలపై ప్రభుత్వం ఎందుకు స్పందించి, చర్యలు తీసుకోవడంలేదని, తన బంధువులకు మేలు చేయడానికే చంద్రబాబు పనిచేస్తున్నారని బొత్స ఆరోపించారు. అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలు ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక రైతులను, ప్రజలను పట్టించుకోకుండా, హామీలు అమలు చేయకుండా పాలన పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ అవేమీ పట్టించుకోకుండా విదేశీ పర్యటనలతో మంత్రులు, సీఎం జాలీగా తిరుగుతున్నారని విమర్శించారు. 2019–24 మధ్యలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో తెచ్చిన పరిశ్రమలన్నీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం తెచ్చినట్టు తన సొంత ప్రచార సాధనాలతో ఊకదంపుడు ప్రచారంతో గొప్పలు చెప్పుకుంటున్నారని బొత్స ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు ఎక్కడ నెరవేర్చారో చెప్పాలని ప్రశ్నించారు.

చంద్రబాబు సొంత మీడియాకి సామాజిక బాధ్యత ఉందా, ఉపాధి హామీపథకంలో అందరికీ ఒకేసారి పని కల్పిస్తున్నారా, మహిళలకు సున్నా వడ్డీ ఇచ్చారా, మరి మహిళా పారిశ్రామిక వేత్తలను ఎలా తయారు చేస్తామని ప్రసంగాలు చేస్తున్నారని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు తప్ప ప్రజలకు, రైతులకు మేలు చేసే ఏ ఒక్క పనీ చేయలేదని, విశాఖ ఇన్‌ఛార్జి మంత్రి ఈ జిల్లాలో ఏ ఒక్క కొత్త అభివృద్ధి పనైనా చేశారా? అని బొత్స ప్రశ్నించారు. మెడికల్‌ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేయడానికి చంద్రబాబు చూస్తున్నారని, ప్రజా వైద్యాన్ని ప్రైవేటీకరిస్తే వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందన్నారు. రెండేళ్లలో రూ.3.5లక్షల కోట్లు అప్పు చేసిన కూటమి ప్రభుత్వం రూ.15 కోట్లు ప్రభుత్వ ఆస్పత్రులకు ఖర్చు చేయలేదా? అని ప్రశ్నించారు. దోపిడీకి పాల్పడడానికి చేతులు కలిపే ఏ ప్రైవేటు సంస్థను వదిలిపెట్టేలి లేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఆస్పత్రులు ప్రైవేటుకు తీసుకున్న వారిని తొలగించి, మరలా ప్రజలకు అంకితం చేస్తామన్నారు.

అప్పు తెచ్చిన రూ .3.5 లక్షల కోట్లు ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు చెప్పాలన్నారు. తమ ఐదేళ్ల హయాంలో రూ. 2.8 లక్షలు అప్పుచేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తే ఈ కూటమి ప్రభుత్వం రెండేళ్లలో రూ. 3.5 లక్షల కోట్లు అప్పుచేసి ప్రజలకు ఏం మంచి చేసిందన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు గుడివాడ అమర్‌నాఽథ్‌, బూడి ముత్యాలనాయుడు, మాజీ ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement