మహిళా శక్తికి నిదర్శనం ‘వనితా వేవ్‌’ | - | Sakshi
Sakshi News home page

మహిళా శక్తికి నిదర్శనం ‘వనితా వేవ్‌’

Apr 25 2026 7:30 AM | Updated on Apr 25 2026 7:30 AM

మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా బీచ్‌రోడ్డులో శుక్రవారం నిర్వహించిన ‘శతాబ్ది వనితా వేవ్‌’వాకథాన్‌ మహిళా శక్తిని ప్రతిబింబిస్తూ విజయవంతంగా సాగింది. ఈ కార్యక్రమాన్ని విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్‌ ప్రారంభించి మాట్లాడారు. మహిళలు తమ ప్రతిభతో అన్ని రంగాల్లో విశేషంగా రాణిస్తున్నారని ప్రశంసించారు. ముఖ్యంగా విద్యా రంగంలో మహిళల భాగస్వామ్యం, నాయకత్వ పాత్ర పెరగడం సంతోషకరమన్నారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్‌ మాట్లాడుతూ మహిళా సాధికారత లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. విశ్వవిద్యాలయంలో ప్రిన్సిపాళ్లు, డీన్లు, వార్డెన్లు, విభాగాధిపతులు వంటి కీలక బాధ్యతల్లో మహిళలు సమర్థవంతంగా సేవలందిస్తున్నారని కొనియాడారు. కాళీమాత ఆలయం నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్‌ సెంటర్‌ వరకు సాగిన ఈ వాకథాన్‌లో పెద్ద సంఖ్యలో మహిళలు, విద్యార్థులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం కన్వెన్షన్‌ సెంటర్‌ వద్ద ఏర్పాటు చేసిన చిత్రకళా ప్రదర్శనను ఎంపీ శ్రీభరత్‌ వీక్షించి, విద్యార్థుల ప్రతిభను అభినందించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన జుంబా నృత్యం, సాంస్కృతిక ప్రదర్శనలు, యోగా ఆసనాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. ఏయూ రెక్టర్‌ ఆచార్య పి.కింగ్‌, సమన్వయకర్త ఆచార్య ఎ.పల్లవి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement