వేసవిలో చోరీలపై ప్రత్యేక నిఘా | - | Sakshi
Sakshi News home page

వేసవిలో చోరీలపై ప్రత్యేక నిఘా

Apr 25 2026 7:30 AM | Updated on Apr 25 2026 7:30 AM

అనకాపల్లి : వేసవి సెలవుల సమయంలో అనేక కుటుంబాలు పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లే నేపథ్యంలో, ఖాళీగా ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎస్పీ తుహిన్‌ సిన్హా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న కొన్ని చోరీ ఘటనలను దృష్టిలో ఉంచుకుని, పోలీసులు ప్రత్యేక నిఘా చర్యలు చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు. ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే దొంగతనాలను పూర్తిగా నివారించవచ్చన్నారు. గృహాల్లో నగదు, బంగారం వంటి విలువైన వస్తువులు ఉంచకూడదని, బ్యాంక్‌ లాకర్లలో భద్ర పరచుకోవాలన్నారు. లాక్డ్‌ హౌస్‌ మోనిటరింగ్‌ సిస్టమ్‌ ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ప్రయాణ వివరాలను నమ్మకమైన పొరుగువారికి, బంధువులకు తెలియజేయాలన్నారు. ఇంటి తలుపులు, కిటికీలు సరిగా లాక్‌ చేశారో లేదో నిర్ధారించుకోవాలని, అవసరమైతే ఆటోమేటిక్‌ లాకింగ్‌ సిస్టమ్‌, అలారం వ్యవస్థలను ఉపయోగించాలన్నారు. బ్యాంకులు, ఏటీఎంలు, బంగారు దుకాణాలు హై–క్వాలిటీ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, అవి నిరంతరం పనిచేస్తున్నాయో లేదో తనిఖీ చేయాలన్నారు. ఏటీఎం సెంటర్ల వద్ద రాత్రి సమయాల్లో సెక్యూరిటీ గార్డులను తప్పనిసరిగా నియమించాలన్నారు. అనుమానాస్పద కదలికలు గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

బస్సులు, రైళ్లలో ప్రయాణించే సమయంలో మీ సామాన్లు, నగలు జాగ్రత్తగా చూసుకోవాలని, అపరిచితులు ఇచ్చే ఆహార పదార్థాలు తీసుకోరాదన్నారు. ఇంటి బయట నిద్రించే వారు ఆభరణాలు ధరించకుండా ఉండడం మంచిదన్నారు. ఏదైనా అనుమానం, అత్యవసర పరిస్థితి ఎదురైతే తక్షణమే 100 / 112 కు కాల్‌ చేస్తే పోలీసులు సహాయపడతారని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement