నర్సీపట్నం : పాలు, గుడ్లు, మాంసం ఉత్పత్తిని పెంచడమే పశుసంవర్ధకశాఖ ముఖ్య ఉద్దేశమని పశుసంవర్ధక/శాఖ ఏడీ డబ్ల్యూ.రాంబాబు తెలిపారు. ఈ మూడు అంశాలు వృద్ధి, అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్ర జీడీపీ పెరుగుదలకు కృషి చేస్తున్నామని తెలిపారు. పాడి రైతులకు వ్యవసాయం కంటే పాడి పరిశ్రమ ఎంతో లాభదాయకంగా ఉంటుందన్నారు. రైతులు పాడి పరిశ్రమపై దృష్టి సారిస్తే మంచి ఆదాయం లభిస్తుందని వివరించారు. అదేవిధంగా పశువులు, కోళ్లలో సీజనల్‌గా వచ్చే వ్యాధుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పశువుల్లో, కోళ్లలో వచ్చే అంటు వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కృత్రిమ గర్భాధారణ ద్వారా మేలు జాతి పశువులను ఉత్పత్తి చేసి రైతులకు మేలు చేకూర్చుతున్నామన్నారు. ముఖ్యంగా వేసవిలో పశువులు, గొర్రెలు, మేకలు, పందులకు సంక్రమించే వ్యాధులపై పెంపకందారులు అప్రమత్తంగా ఉండాలని, అలాగే పశువైద్యుల సూచనలు మేరకు టీకాలు వేయించాలని, కోళ్ల వ్యాధుల పట్ల కూడా శ్రద్ధ చూపాలని సూచించారు.


