బెదిరించి తరలించినా.. సీఎం సభ వెలవెల | - | Sakshi
Sakshi News home page

బెదిరించి తరలించినా.. సీఎం సభ వెలవెల

Apr 24 2026 6:08 AM | Updated on Apr 24 2026 6:08 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలతో సామాన్య ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. జిల్లాలో రాంబిల్లి మండలంలో జరిగిన సభకు బస్సుల తరలింపుతో... దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. రాకుంటే రుణాలు మంజూరు చేయబోమని బెదిరించి భారీ ఎత్తున డ్వాక్రా సభ్యులను సభకు తరలించినా వారు చంద్రబాబు ప్రసంగం ప్రారంభమైన కొద్దిసేపటికే బయటకు వచ్చేశారు. దీంతో కుర్చీలు ఖాళీ అయిపోయాయి. కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో సభకు వెళ్లినవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎండవేడిని భరించలేక అవస్థలకు గురయ్యారు.

సీఎం చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో ఖాళీ అయిన సభా ప్రాంగణం , (ఇన్‌సెట్‌) రెన్యూ సోలార్‌ ఇగాట్‌ వేఫర్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తున్న సీఎం

సాక్షి, అనకాపల్లి/అచ్యుతాపురం రూరల్‌ : ‘ఎంకి పెళ్లి..సుబ్బి చావు కొచ్చింది’ అన్నట్లుగా సీఎం చంద్రబాబు బహిరంగ సభ రెండు జిల్లాల ప్రయాణికులకు అవస్థలు తెచ్చిపెట్టింది. రాంబిల్లి మండలంలో జెడ్‌. చింతువ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ‘రెన్యూ సోలార్‌ ఇన్‌గాట్‌–వేఫర్‌ ప్లాంట్‌’ను గురువారం సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అక్కడ నిర్వహించిన బహిరంగ సభకు జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేశారు. ఈ నేపథ్యంలో ఒక రోజు ముందు నుంచే అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం, అనకాపల్లి డిపోలు, విశాఖలో సింహాచలం, మద్దిలపాలెం, వాల్తేరు డిపోల నుంచి 300కు పైగా ఆర్టీసీ బస్సులను సీఎం బహిరంగ సభకు జనాన్ని తరలించేందుకు గ్రామాలకు పంపించారు. దీంతో గురువారం ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు రాకపోవడంతో ప్రయాణికుల తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. బస్సులు రాకపోవడంతో అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్‌, బస్టాండ్‌ల్లో ఉదయం నుంచే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మండుటెండలో రోడ్లపై గంటల తరబడి పడిగాపులు కాశారు. చివరికి దిక్కుతోచని స్థితిలో ఆటోలు,క్యాబ్‌ల్లో అధిక చార్జీలు చెల్లించి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడాయి

ప్రసంగం మధ్యలోనే జనం ‘జంప్‌’

చంద్రబాబు మెప్పు పొందేందుకు వందలాది ఆర్టీసీ బస్సుల ద్వారా స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు జనాన్ని తరలించారు. సభకు రాకుంటే రుణాలు మంజూరు చేయబోమని డ్వాక్రా సభ్యులను బెదిరించి మరీ సీఎం బహిరంగ సభకు అధిక సంఖ్యలో తరలించారు. అనకాపల్లి, యలమంచిలి, పరవాడ, సబ్బవరం, పాయకరావు పేట నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున తరలించారు. సభ 11.10 గంటలకు ప్రారంభం కావాల్సి ఉన్నా..జనం రాకపోవడంతో కాసింత ఆలస్యంగా ప్రారంభమైంది. రెండు గంటల ముందే జనాన్ని తరలించడంతో ఎండ తీవ్రతకు తట్టుకోలేక..చాలా మంది సమీపంలో ఉన్న కొబ్బరి చెట్ల కింద సేదతీరారు. చంద్రబాబు ప్రసంగం ప్రారంభమైన 10 నిమిషాల్లోనే జనం బయటకు వెళ్లిపోతుండడంతో వారిని ఆపేందుకు పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సభ పూర్తయ్యేవరకూ ఉండాలని కోరినా గేట్లు తోసుకుంటూ బయకు వచ్చేశారు. మిట్ట మధ్యాహ్న సమయంలో బహిరంగ సభ జరిగినా కనీస తాగునీరు, మజ్జిగను కూడా నిర్వాహకులు అందించకపోవడంతో సభకు వచ్చిన వారంతా ఎండవేడిమి తాళలేక నానా ఇబ్బందులు పడ్డారు. సభ పూర్తి కాకుండానే సభ మధ్యలోనే జనమంతా వెనుదిరిగిపోయారు.

గోడు చెప్పుకోకుండా అడ్డుకున్నారు

తమ సమస్యలు చెప్పుకునేందుకు జిల్లాలో పలువురు రైతులు, దివ్యాంగులు వినతి పత్రాలు అందించేందుకు వచ్చారు. అయితే చంద్రబాబును కలవనీయకుండా అడ్డుకోవడంతో గేటు బయటే వేచి చూసి వెనదిరిగారు. నక్కపల్లి మండలంలో డి.ఎల్‌. పురానికి చెందిన 60 ఏళ్ల దివ్యాంగుడు నానేపల్లి మాణిక్యం తన భూ సమస్యను సీఎం చంద్రబాబుకు విన్నవించుకోవాలని వెళితే కుదురదుపొన్నారు. రూ.2 కోట్లు విలువైన భూమిని నా ప్రమేయం లేకుండా అమ్మేశారని, నాకు న్యాయం చేయాలని కోరేందుకు వెళ్లానని, సీఎంను కలవడం కుదరదు పొమ్మన్నారని ఆ వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

బస్టాపుల్లో ప్రయాణికుల పడిగాపులు

జనసమీకరణ కోసం ఆర్టీసీ బస్సుల తరలింపు

చంద్రబాబు సభతో జనానికి అవస్థలు

సభ ఆలస్యం.. బాబు ప్రసంగం మధ్యలోనే జనం ‘జంప్‌’

మత్స్యకారుల నిరసన

రాంబిల్లి పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు మత్స్యకారుల నుంచి నిరసన సెగ ఎదురైంది. ఫార్మా కంపెనీలు వద్దు..మాకు జీవనోపాధి కలిగించే ఫిషింగ్‌ హార్బర్‌ ముద్దు అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. పూడిమడక గ్రామ సమీపంలో బ్లూజెట్‌ ఫార్మా కంపెనీ ఏర్పాటును రద్దు చేయాలి..ఫిషింగ్‌ హార్బర్‌ పనులను పున:ప్రారంభించాలి..బల్క్‌డ్రగ్‌ పార్కును వద్దు అంటూ తమ డిమాండ్‌ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. సీఎంకు వినతిపత్రం అందజేసేందుకు వెళ్లిన వారిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే సీఐ చంద్రశేఖర్‌రావుకు మత్స్యకార నాయకులు చొడిపల్లి అప్పారావు, వాసుపల్లి శ్రీనివాసరావు, ఉమ్మడి జగన్‌, ఉమ్మడి అప్పారావు, మత్స్యకారులు మేరుగ చినరాజులు, చేపల శ్రీరాములు, మేరుగ అప్పలరాజు,ఏరిపిల్లి ముత్యాలు, ఏరిపిల్లి భాను వినతి అందజేశారు. అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామంలో మత్స్యకారులు సీఎం చంద్రబాబుకు వినతి ఇచ్చేందుకు బయలుదేరగా ..పోలీసులు అడ్డుకోవడంతో ...అక్కడే నిరసన తెలియజేసి సీఐ చంద్రశే ఖర్‌కు వినతి పత్రం అంద జేశారు.

డ్వాక్రా సభ్యులపై ‘కూటమి’ ఒత్తిడి..

‘సభకు రాకపోతే రుణాలు కట్‌’ అంటూ బెదిరింపులు

బయటకు వెళ్లేవారిని అడ్డుకున్న పోలీసులు

Advertisement
 
Advertisement
Advertisement