కశింకోట: ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు ప్రత్యేకంగా తయారు చేసిన విత్తనాల కిట్లను పంపిణీ చేయనున్నట్లు ప్రకృతి వ్యవసాయ వనరుల జిల్లా అధికారి లచ్చన్న తెలిపారు. మండలంలోని సుందరయ్యపేటలో ఉన్న బీఆర్‌సీ కేంద్రంలో సిద్ధం చేసిన పీఎండీఎస్ విత్తనాల కిట్లను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో భూసారం పెంపునకు మాత్రమే పచ్చిరొట్ట విత్తనాలు, జీలుగు, పిల్లి పెసర, జనుం వంటివి సాగు చేసే వారన్నారు. ప్రస్తుతం రుతు పవనాలు రాకకు ముందే పీఎండీఎస్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ప్రత్యేకంగా తయారు చేసిన విత్తనాల కిట్లను అందిస్తున్నట్లు చెప్పారు. సాధారణంగా వర్షాలు పడిన తర్వాత అదను సమయంలో రైతులు విత్తనాలు నాటుతారన్నారు. అయితే పీఎండీఎస్ విధానం అందుకు భిన్నంగా వర్షాలకు ముందే విత్తనాలు వేయాలని చెప్పారు. వేసవి దుక్కులతో పొలాలు సిద్ధం చేసి నవ ధాన్యాలు, ఆకు కూరలు, కూరగాయలు, అపరాలు, చిరు ధాన్యాలు, నూనె గింజలు వంటి విత్తనాలు ముందుగా జల్లాలని, వేసవిలో కురిసే అకాల వర్షాలకు అవి మొలకెత్తుతాయన్నారు. వాటిలో తొలుత ఆకు కూరలు, తర్వాత కూరగాయలు కోతకు వస్తాయని చెప్పారు. చివరగా చిరు ధాన్యాలు, అపరాలు పండుతాయన్నారు. సుందరయ్యపేట బీఆర్‌సీ కేంద్రంలో 250 విత్తనాల కిట్లు సిద్ధం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రం నిర్వాహకురాలు కూండ్రపు అరుణ, మండల ప్రకృతి వ్యవసాయం ఇన్‌చార్జి డి. రమణ, ఐసీఆర్‌పీ చిన్నతల్లి తదితరులు పాల్గొన్నారు.


