రంగు చూస్తే... బుట్టలో పడ్డట్టే..! | - | Sakshi
Sakshi News home page

రంగు చూస్తే... బుట్టలో పడ్డట్టే..!

Apr 22 2026 7:24 AM | Updated on Apr 22 2026 7:24 AM

మార్కెట్‌లో కార్బైడ్‌ మామిడిపండ్లు పక్వానికి రాకుండానే మామిడిని ముగ్గిస్తున్న వ్యాపారులు రంగు చూసి మోసపోవద్దంటున్న వైద్యులు జిల్లా కేంద్రం అనకాపల్లిలోనే అఽధికంగా నిల్వలు

తేడాలను గుర్తించండిలా...

●సహజంగా పండే మామిడి కొంత పసుపు, మరికొంత ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి లోపలి భాగం పరిపక్వంగా ఉంటుంది.

●కృత్రిమంగా పండే పండ్లు మొత్తం ఒకే విధమైన రంగును కలిగి ఉంటాయి. పైకి పండినట్టు కనిపించినా లోపల ఫలం రుచిలో తేడా ఉండి పుల్లదనం ఉంటుంది.

●సహజంగా పండే పండ్ల నుంచి వచ్చే వాసన ఇట్టే గుర్తించవచ్చు. కృత్రిమంగా పండించిన పండ్ల నుంచి వాసన ఏమాత్రం రాదు.

●సహజసిద్ధంగా పండించే పండ్లలో తగినంత చక్కెర శాతం ఏర్పడి తియ్యగా ఉంటాయి.

●బహిరంగ మార్కెట్లో పండ్లను కొని తినే ముందు ఉప్పు నీటిలో 20 నిమిషాలు ఉంచి తిరిగి మంచి నీటితో శుభ్రంగా కడిగి అనంతరం తొక్కను తీసి తినడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.

తుమ్మపాల : వేసవి కాలం మొదలైతే ప్రజలందరికీ అందరికి గుర్తొచ్చేది మామిడి పండ్లే. సహజసిద్ధమైన తీపి, నోరూరించే రుచి, పోషక విలువలతో మామిడి పండు ప్రకృతి మనకు అందించిన అద్భుత వరంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మే, జూన్‌ నెలల్లో పూర్తిగా పక్వానికి వచ్చిన మామిడిపండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఏప్రిల్‌ నెలలోనే వ్యాపారులు లాభాపేక్షతో మామిడిపండ్లను కృత్రిమంగా మగ్గించి మార్కెట్‌లోకి తీసుకువస్తున్నారు. కాల్షియం కార్బైడ్‌ వంటి హానికర రసాయనాలను ఉపయోగించి పండ్లను వేగంగా పక్వానికి తెస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ విధంగా కృత్రిమంగా మగ్గించిన మామిడి పండ్లు బయటకు ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ, వాటి లోపల పూర్తిగా పండకపోవడం వల్ల రుచి తగ్గడమే కాకుండా ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇలాంటి పండ్లు తినడం వల్ల కడుపునొప్పి, వాంతులు, చర్మ సమస్యలు, తలనొప్పి వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అనకాపల్లి పట్టణం, మండలంలో దాదాపు ప్రతి గ్రామంలోను మామిడి తోటలు ఉన్నాయి. ఈ ఏడాది పూత తగ్గి భారీగా మామిడి ఉత్పత్తి తగ్గిపోయింది. అక్కడక్కడ కొంత మేర పండినా మామిడి ఆయా గ్రామాల పరిధిలోనే విక్రయాలు జరిగిపోతున్నాయి. పట్టణంలో మార్కెట్‌కు ఇతర ప్రాంతాల నుంచి మామిడి దిగుమతి చేసుకుని వ్యాపారులు అమ్మకాలు చేస్తున్నారు. దీంతో డజన్‌ పండ్లు ప్రస్తుతం రూ.300 వరకు మార్కెట్‌ ధర ఉంది. ఉమ్మడి జిల్లాలో గ్రామీణ వాణిజ్య కేంద్రంగా ఉన్న అనకాపల్లిలో నిత్యం వేల సంఖ్యలో మామిడి దిగుమతి జరుగుతుంది. ఇక్కడ నుంచి జిల్లా వ్యాప్తంగా సరఫరా జరుగుతుంది. ఈ ఏడాది ముందుగానే మామిడి పండ్లు మార్కెట్‌లోకి రావడంతో ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. రంగు చూసి కాకుండా ప్రజలు పూర్తి అవగాహన కలిగి పండ్లను కొనుగోలు చేయాలని, కృత్రిమ పండ్లను గుర్తించే చిట్కాలు తెలుసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

పక్వానికి వచ్చినప్పుడు.....

మామిడి కాయలు పక్వానికి వచ్చిప్పుడు ప్రకృతి సిద్ధంగా వాటి నుంచి ఉత్పత్తయ్యే ఇథిలియన్‌ కారణంగా కాయలు పండి మంచి రంగును స్వయంగా చేకూర్చుకుంటాయి. తద్వారా వచ్చిన రుచి, పోషకాలు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. అయితే కొంతమంది ఈ తరహా పద్ధతులకు స్వస్తి చెప్పి రసాయనాలతో మగ్గించి, ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇథిలియన్‌ వాయువు 100 పీపీఎంలు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. ఈ వాయువును 24 గంటలు తగిలేటట్టుగా ఐదు రోజులు కాయలను ఉంచితే సహజత్వానికి దగ్గరగా ఎటువంటి హాని లేకుండా పక్వానికి వస్తాయి. మామిడి కాయల కోత అనంతరం వంద లీటర్ల నీటికి 13 ఎం.ఎల్‌ ఎత్రిల్‌ కలిపి అందులో ముంచి ఆరబెడితే సహజత్వానికి దగ్గరగా పండుతాయి. మరింత సురక్షితంగా, సంప్రదాయబద్ధంగా పండించాలంటే ఇళ్లల్లో వరిగడ్డి వేసి కాయలను నిల్వ ఉంచడం ద్వారా పండించవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. కాల్షియం కార్బైడ్‌ వినియోగంపై ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ, కొంతమంది వ్యాపారులు అక్రమంగా రసాయనాలను ఉపయోగిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందువల్ల ప్రజలు మామిడిపండ్లు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రంగు చూసి మోసపోవడం, సీజన్‌కు ముందు వచ్చే పండ్లను ఆరగించడం ఆరోగ్యకరం కాదని గుర్తించాల్సి ఉంది.

తనిఖీల్లో అధికారుల నిర్లక్ష్యం....

సంబంధిత అధికారులు మార్కెట్లపై నిరంతర తనిఖీలు నిర్వహించి కృత్రిమంగా పండ్లు మగ్గించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ ఎటువంటి తనిఖీల్లేని కారణంగా యథేచ్ఛగా కృత్రిమంగా పండించిన పండ్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇలా కృత్రిమంగా మగ్గించిన మామిడిపండ్ల విక్రయంపై కట్టడి అవసరమని, వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు, అధికారులు హెచ్చరిస్తున్నారు.

నిషేధిత రసాయనాలతో ముప్పు

కృత్రిమంగా కార్బైడ్‌ ఉపయోగించి పండించిన పండ్లు ఆరగించడం వల్ల ఆరోగ్యానికి హాని. దీనివల్ల కడుపులో అల్సర్‌, క్యాన్సర్‌తో పాటు కాలేయం, మూత్ర పిండాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వినియోగదారులు శ్రేష్టమైన, సహజసిద్ధంగా పండే మామిడి పండ్లను ఆరగించాలి. నిషేధిత పదార్థాలను వాడి మామిడిని పండించి బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి.

–డిడి నాయుడు, వైద్యుడు, అనకాపల్లి

Advertisement
 
Advertisement
Advertisement