సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం వైభవంగా ముగిసింది. సోమవారం తెల్లవారుజామున ప్రారంభమైన స్వామి నిజరూప దర్శనం, మంగళవారం తెల్లవారుజామున ఒంటి గంట వరకు కొనసాగింది. రాత్రి 7 గంటలకే క్యూల ప్రవేశ ద్వారాలను అధికారులు మూసివేసి, అప్పటి వరకు క్యూల్లో ఉన్న భక్తులందరికీ ఒంటి గంట వరకు దర్శనం కల్పించారు. ఒకవైపు సహస్రఘటాభిషేకం, ఇతర వైదిక క్రతువులు జరుగుతున్నా, భక్తులకు యథావిధిగా దర్శనాలు కల్పించారు. మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు సహస్రఘటాభిషేకం పూర్తయిన అనంతరం, స్వామికి తొలి విడతగా మూడు మణుగుల(సుమారు 125 కిలోల) పచ్చి చందనాన్ని సమర్పించారు. ఆ తర్వాత చందన కవచంలో ఉన్న సింహాద్రి నాథుడికి పవళింపు సేవ నిర్వహించి, తిరిగి మంగళవారం ఉదయం 9.30 గంటల నుంచి భక్తులకు దర్శనాలు ప్రారంభించారు. తొలి విడత చందన సమర్పణ పూర్తవడంతో, గుమ్మడికాయ ఆకారంలో ఉన్న స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
1.34 లక్షల మందికి దర్శనం
చందనోత్సవం సందర్భంగా మొత్తం 1,34,271 మంది భక్తులు స్వామి నిజరూప దర్శనం చేసుకున్నారని దేవస్థానం ఈవో జె.వెంకటరావు వెల్లడించారు. ఈ ఏడాది క్యూల పర్యవేక్షణ పటిష్టంగా ఉండటం వల్ల దర్శనాలు సాఫీగా జరిగాయని పేర్కొన్నారు. మొత్తం 46,431 టికెట్లు(రూ.300, రూ.1000, రూ.1500 ) జారీ చేయగా, స్కానింగ్ ద్వారా 37,764 టికెట్లను తనిఖీ చేశారు. భక్తుల సౌకర్యార్థం 6 పికప్ పాయింట్ల నుంచి 90 ఆర్టీసీ బస్సులను నడిపారు. ఈ బస్సులు మొత్తం 1,774 ట్రిప్పులు తిరిగాయి. ఎండ తీవ్రత దృష్ట్యా 1.30 లక్షల లీటర్ల తాగునీటిని సిద్ధం చేయగా, భక్తులు 1.24 లక్షల లీటర్ల నీటిని వినియోగించుకున్నారు. కమాండ్ కంట్రోల్ ద్వారా అందిన 23 ఫిర్యాదులను ‘జీరో పెండింగ్’విధానంలో వెంటనే పరిష్కరించామని ఈవో తెలిపారు.


