అంబేడ్కర్ కాలనీలోని పాఠశాలకు ఆటోలో వెళ్తూ ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
దేవరాపల్లి : దేవరాపల్లి నాలుగు రోడ్ల కూడలి సమీపంలోని మెయిన్ స్కూల్‌ను బేసిక్ ప్రైమరీగా స్కూల్‌గా (1 నుంచి 5వ తరగతి వరకు బోధించే స్కూల్) మార్పు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న డిమాండ్ చేశారు. దేవరాపల్లిలో మంగళవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం, కూటమి నేతల దురుద్దేశంతో దశాబ్దాల చరిత్ర కలిగిన మెయిన్ స్కూల్‌ను మూతపడే దశకు చేర్చారని విమర్శించారు. నూతన విద్యా విధానం పేరిట 3,4,5 తరగతులను అంబేడ్కర్ కాలనీలోని పాఠశాలకు పంపించేసి మెయిన్ స్కూల్‌ను 1, 2 తరగతులకే పరిమితం చేశామరన్నారు. ప్రధాన కూడలికి ఆనుకొని ఉన్న రూ.కోట్లు విలువ చేసే పాఠశాల స్థలంపై అధికార పార్టీ నాయకులు కళ్లు పడ్డాయని, పిల్లలు లేరనే నెపంతో స్కూల్ మూసివేసి స్థలాన్ని కాజేసేందుకు కుట్రలు పన్నారని వెంకన్న ధ్వజమెత్తారు. అన్ని అర్హతలు ఉన్నా మెయిన్ స్కూల్‌ను బేసిక్ ప్రైమరీ స్కూల్‌గా ఉంచాలని అప్పట్లో విద్యా కమిటీ తీర్మానం చేసినా అధికారులు పట్టించుకోలేదన్నారు. గ్రామ శివారులో ఉన్న అంబేడ్కర్ కాలనీలోని పాఠశాలకు వెళ్లేందుకు ఎరుకల కాలనీ, కొరుప్రోలు కల్లాల్లోని 3,4,5 తరగతుల విద్యార్థులు రోజూ ఆటోకు రూ.20 ఇచ్చి వెళ్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వ నూతన విద్యా విధానంతో మండలంలోని ఇప్పటికే పలు పాఠశాలలు మూతపడ్డాయని, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని పాఠశాలలు మూసి వేస్తే భవిష్యత్‌లో ప్రభుత్వ విద్య పేదలకు అందే పరిస్థితి ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు.


