సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు పరిశీలిస్తున్న కలెక్టర్ విజయకృష్ణన్, డీఐజీ గోపీనాధ్ జట్టీ, ఎస్పీ తుహిన్ సిన్హా
సాక్షి, అనకాపల్లి : ఈనెల 23న సీఎం చంద్రబాబు రాంబిల్లి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పరిశీలించారు. మంగళవారం సాయంత్రం డీఐజీ గోపీనాథ్ జట్టి, ఎస్పీ తుహిన్ సిన్హాలతో కలిసి క్షేత్ర స్థాయి పరిశీలన చేసి, అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సమావేశానికి హాజరయ్యే ప్రజల రవాణా కోసం ఏపీఎస్‌ఆర్టీసీ ద్వారా సుమారు 300 బస్సులు ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. ఈ నెల 23న ఉదయం 7 గంటల నుంచే వివిధ పాయింట్ల నుంచి బయలుదేరనున్నాయని తెలిపారు. ముందురోజే బస్సులను నిర్ణయించిన ప్రదేశాల్లో సిద్ధంగా ఉంచనున్నట్టు తెలిపారు. సభ ప్రాంగణంలో పూర్తి ఎయిర్ కండిషనింగ్ సదుపాయం కల్పించడంతో పాటు, 150 టాయిలెట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గ్యాలరీల్లో తాగునీరు, భోజనం, మజ్జిగ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సచివాలయ సిబ్బందిని మొబిలైజ్ చేసి, ప్రతి విభాగానికి ఇన్‌చార్జిలను నియమించినట్టు తెలిపారు.


