బుచ్చెయ్యపేట : భూమి ఆన్‌లైన్ మ్యుటేషన్‌కు రూ.లక్షా యాభై వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు వీఆర్వో పట్టుబడ్డాడు. బుచ్చెయ్యపేట మండలం పి.భీమవరానికి చెందిన వీఆర్వో పోతల శంకరరావు ఓ వ్యక్తి కొనుగోలు చేసిన రెండున్నర ఎకరాల భూమి ఆన్‌లైన్ మ్యుటేషన్ చేయడానికి రూ.లక్షా యాభై వేలు డిమాండ్ చేశాడు. దీంతో కొనుగోలుదారు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సోమవారం భూమి కొనుగోలుదారుడు నుండి పి భీమవరం సచివాలయంలో లక్షా యాభై వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యేండెడ్‌గా వీఆర్వోను పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీలు హర్షిత, రమణమూర్తిలు విలేకరులకు వివరాలు తెలిపారు. పి.భీమవరం సచివాలయం పరిధిలో రెండున్నర ఎకరాలు భూమిని ఒక వ్యక్తి కొనుగోలు చేశాడని, అయితే రీ సర్వేలో భూమి కొనుగోలు చేసిన వ్యక్తికి కాకుండా విక్రయించిన రైతు పేరుపై ఆన్‌లైన్ చేశారన్నారు. దీంతో కొనుగోలుదారు ఆ భూమిని తన పేరున ఆన్‌లైన్ మ్యుటేషన్ చేయాలని వీఆర్వోని సంప్రదించగా, అతను ఆన్‌లైన్ మ్యూటేషన్‌కు రూ.లక్షా యాభై వేలు లంచం డిమాండ్ చేశాడన్నారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులని ఆశ్రయించాడన్నారు. పి.భీమవరం సచివాలయంలో భూమి కొనుగోలుదారు నుంచి రూ.లక్షా యాభై వేలు లంచం తీసుకుంటుండగా సోమవారం వీఆర్వోను పట్టుకున్నామన్నారు. గతంలో కూడా రెండు చోట్ల ఇతను లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడన్నారు. వీఆర్వోపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామన్నారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 1064కు గాని తమకి నేరుగా గానీ ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదుదారు వివరాలను గుట్టుగా ఉంచుతామన్నారు.


