గ్రావెల్‌ గద్దలు | - | Sakshi
Sakshi News home page

గ్రావెల్‌ గద్దలు

Apr 20 2026 8:35 AM | Updated on Apr 20 2026 8:35 AM

నిర్వాసితుల పేరుతో దందా పొక్లెయిన్‌లతో తవ్వి ట్రాక్టర్లతో తరలింపు కూటమినేతల బరితెగింపు కన్నెత్తిచూడని మైనింగ్‌, రెవెన్యూ అధికారులు ఏంఎంఆర్‌ సిబ్బంది అక్రమ వసూళ్లు

ఏపీఐఐసీ భూముల్లో

బోదిగల్లం వద్ద ఏిపీఐఐిసీ భూముల్లో పొక్లెయిన్‌తో తవ్వుతున్న గ్రావెల్‌

తవ్వకాలు జరిపే ప్రాంతంలో ట్రాక్టర్‌,పొక్లెయిన్‌ల యజమానులు

నక్కపల్లి: కొందరు కూటమి నేతలు అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఏపీఐఐసీ భూముల్లో ఉన్న గ్రావెల్‌ను అక్రమంగా తవ్వేస్తున్నారు. రాత్రిపూట నాలుగైదు పొక్లెయిన్లతో తవ్వించి పదుల సంఖ్యలోని ట్రాక్టర్లలో తరలించుకుపోతున్నారు. రోజుకు 300 ట్రిప్పుల పైనే గ్రావెల్‌ను ట్రాక్టర్లపై ఇతర ప్రాంతాలకు తరలించేస్తున్నారు.నిర్వాసితుల కోసం ఈ గ్రావెల్‌ను తరలిస్తున్నామని చెబుతూ సమీపంలో ఉన్న రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులకు, కంపెనీలకు విక్రయించి లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ప్రభుత్వం కేటాయించిన పునరావాస కాలనీలో ఇళ్లు నిర్మించుకుంటున్న నిర్వాసితులు పునాదుల్లోకి మట్టి తెచ్చుకుంటే పట్టుకుని కేసులు నమోదు చేసి ముక్కుపిండి అపరాధ రుసుం వసూలు చేస్తున్న మైనింగ్‌అధికారులు, ఏంఎంఆర్‌ సంస్థ ప్రతినిధులు ఈ గ్రావెల్‌ తవ్వకాలపై కన్నెత్తి చూడకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ, పోలీసు అధికారుల సైతం ఈ గ్రావెల్‌ తరలింపుపై చూసీచూడనట్టు ఉంటున్నా రని స్థానికులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. స్టీల్‌ప్లాంట్‌, బల్క్‌ డ్రగ్‌పార్క్‌ కోసం నివాసప్రాంతా లు కోల్పోయిన వారికి పునరావాస కాలనీ ఏర్పాటుకు ప్రభుత్వం పెదబోదిగల్లం వద్ద ప్రైవేటు వ్యక్తుల నుంచి 160 ఎకరాలను ఏపీఐఐసీ ద్వారా కొనుగోలు చేసింది. ఇక్కడ కొంతభూమిలో లేఅవుట్లు ఏర్పాటు చేసి 735 మందికి ఐదుసెంట్ల చొప్పున ఇంటి స్థలం కేటాయించింది. మిగిలిన భూములు ఏపీఐఐసీ ఆధీనంలో ఉన్నాయి. వీటిలో అపారమైన గ్రావెల్‌ ఉంది. కొంత మంది అక్రమార్కులు, కూటమినాయకులు ఈ భూముల్లో రాత్రిపూట పొక్లెయిన్‌లతో గ్రావెల్‌ను తవ్వేస్తున్నారు. నిర్వాసితులకే సరఫరా చేస్తున్నామని చెబుతూ బయట వ్యక్తులకు అమ్మేస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా గ్రావెల్‌ను దోచేస్తున్న నాయకులు, ట్రాక్టర్ల యజమానులపై సంబంధిత శాఖల అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.కూటమి పెద్దల అండదండలతో గ్రావెల్‌ దందా జరుగుతుండటంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. శనివారం రాత్రి నుంచి తెల్లవార్లూ ఐదు పొక్లెయిన్లతో పునరావాసకాలనీకి సమీపంలో ఉన్న ఏపీఐఐసీ భూముల్లో గ్రావెల్‌ తవ్వేసి 10ట్రాక్టర్లతో తరలించుకుపోయారు. హోంమంత్రి అనుచరులమని చెప్పుకొంటున్న ట్రాక్టర్లు కలిగినవారే ఈ గ్రావెల్‌ను తవ్వేస్తున్నారని, కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు.

ఏఎంఆర్‌ ప్రతినిధుల రుబాబు

ప్రభుత్వం ఇచ్చిన నిధులతో తాము ఇళ్లు నిర్మించుకుని పునాదిలోకి ట్రాక్టర్‌ మట్టి తెచ్చుకుంటే మైనింగ్‌, ఏఎంఆర్‌ సంస్థ సిబ్బంది వచ్చి కేసులు నమోదు చేసి పెనాల్టీ విధిస్తున్నా రని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. తమ ట్రాక్టర్లను పట్టుకుని అనుమతులు చూపించాలని, కానిపక్షంలో మంత్రికి సన్నిహితంగా ఉండే వారెవరితోనైనా ఫోన్‌ చేయిస్తే వదిలేస్తామని ఏఎంఆర్‌ ప్రతినిధులు చెబుతున్నారని నిర్వాసితులు వాపోతున్నారు. ఈ సంస్థ ప్రతినిధులమని చెప్పుకుంటున్నవారి వద్ద ఎటువంటి గుర్తింపుకార్డులు లేవన్నారు. వారు అసలు సిబ్బందో నకిలీయో కూడా తెలియడం లేదన్నారు.కంపెనీల కోసం ఇళ్లను ఖాళీ చేయించారని సొంత ఊళ్లనుంచి మమ్మల్ని తరిమేశారని, వేరొక చోట ఇల్లు నిర్మించుకోడానికి సిద్ధపడి పునాదుల్లోకి తట్టెడు మట్టికూడా వేసుకోకుండా అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమనివారు వాపోతున్నారు. గ్రావెల్‌ మాఫియా వద్దే గ్రావెల్‌ కొనుగోలు చేయాలని సొంతంగా తాము తెచ్చుకోడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అధికార పార్టీకి చెందిన నాయకులు మాత్రం కళ్ల ముందే పదుల సంఖ్యలో ట్రాక్టర్లపై తరలించుకుపోతుంటే సిబ్బంది పట్టించుకోవడం లేదంటున్నారు. ఎవరైనా నిలదీస్తే మంత్రికి చెప్పి నీసంగతి తేలుస్తామంటూ బెదిరిస్తున్నారని నిర్వాసితులు వాపోతున్నారు. ఇళ్లనిర్మాణ దారులకు గ్రావెల్‌,ఇసుక ఉచితమని ఒక ప్రభుత్వం చెబుతూనే మరో పక్క ఏఎంఆర్‌, మైనింగ్‌ శాఖ ద్వారా సీనరేజ్‌ పేరుతో ట్రాక్టర్‌నుంచి రూ.400నుంచి రూ.1000 వసూలు చేస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement