నక్కపల్లి: మండల కేంద్రం నక్కపల్లి వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం తప్పింది. భువనేశ్వర్ నుంచి చైన్నె వెళ్తున్న బస్సు డీవైడర్‌ను ఢీకొని హైవే నుంచి ఐదు అడుగుల లోతున ఉన్న కాలువలో బోల్తాపడింది. ప్రయాణికులందరూ స్వల్పగాయాలతో బయటపడ్డారు. వివరాల్లోకి వెళ్తే భువనేశ్వర్‌నుంచి చైన్నె వెళ్తున్న షామోలి ప్రైవేటు ట్రావెల్ బస్సు ఆదివారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో జాతీయరహదారిపై నక్కపల్లి ఎస్సీ కాలనీ ఎదురుగా ఉన్న ఎస్సీ హాస్టల్ వద్ద డివైడర్‌ను ఢీకొని కాలువలోకి బోల్తా పడింది. డ్రైవర్ నిద్రమత్తులో డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. బస్సు విద్యుత్ తీగలను తాకుతూ వెళ్లి బోల్తాపడింది.ఈ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంవల్ల కూడా పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్, 35 మంది ప్రయాణికులు కలిపి మొత్తం 38 మంది ఉన్నారు. తెల్లవారు జామున అందరూ గాఢ నిద్రలోఉన్న సమయంలో బస్సు బోల్తాపడటంతో ఏం జరిగిందో తెలియక ప్రయాణకులు పెద్దపెట్టున కేకలు వేశారు.
పెద్దగా శబ్దం రావడంతో స్థానికులు వెంటనే మేల్కొని ప్రమాదం జరిగిన ప్రాంతానికి పరుగులు తీశారు. స్థానికుల సమాచారం మేరకు సీఐ జె.మురళి, ఎస్‌ఐ సన్నిబాబు తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని బస్సులో ఇరుక్కున్నవారిని బయటకు తీశారు. వీరంతా భువనేశ్వర్ నుంచి చైన్నె, నెల్లూరు, విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్తున్నారు. ప్రమాదంలో ఐదుగురికి ఓ మోస్తరు గాయాలుకాగా, మరో పది మందికి స్వల్పగాయాలయ్యాయి. గాయపడినవారిలో భువనేశ్వర్‌కు చెందిన బస్సు డ్రైవర్ చైతన్య, ఉద్దండపురానికి చెందిన డ్రైవర్ గణపతి, ఉద్దండపురానికి చెందిన క్లీనర్ రామాల రామకృష్ణ, ప్రయాణికులు ఉమామహేశ్వరరావు, సిపుల్, నిర్మల్‌కుమార్, మునిస్వామి, మోహన్ లోకేష్‌లున్నారు. వీరిలో మునిస్వామి, మోహన్ లోకేష్‌లను విశాఖ తరలించారు. మిగిలిన ముగ్గురితో పాటు స్వల్పగాయాలకు గురైన ప్రయాణికులను నక్కపల్లి ఆస్పత్రికి తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. వీరిలో కొంతమంది ప్రయాణాలు రద్దుచేసుకుని వెనక్కి వెళ్లిపోయారు. మరికొంతమంది చైన్నె వెళ్లేందుకు సిద్ధపడటంతో ట్రావెల్స్ వారు ఏర్పాటు చేసిన మరో బస్సులో బయలుదేరారు. బోల్తాపడిన బస్సును పొక్లెయిన్‌ల సాయంతో బయటకుతీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ మురళీ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు మాట్లాడుతూ నిద్రలో ఉన్న సమయంలో బస్సు బోల్తాపడిందని చెప్పారు. పెద్దగా శబ్దం రావడంతో మెలకువ వచ్చిందన్నారు. లేచి చూసేసరికి కాలవలో పడి ఉందని చెప్పారు. చాలా భయం వేసిందని, ఇంతలో స్థానికులు, పోలీసులు వచ్చి ఒక్కొక్కరినీ బయటకు తీశారని తెలిపారు. చిన్నపాటి గాయాలు మినహా ఎవరికీ ఏమీ కాలేదని మేం చాలా అదృష్టవంతులమని చెప్పారు.


