కె.కోటపాడు: మండల కేంద్రం కె.కోటపాడులోని హైస్కూల్ పాత ప్రహరీని గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం కూల్చివేశారు. పాఠశాలకు సెలవు కావడంతో అదును చూసుకుని కూల్చివేశారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత ప్రహరీ ఉంటుండగా..పాఠశాల తరగతి భవనాలకు సమీపంలోనే నూతన ప్రహరీని నిర్మించారు. పాత ప్రహరీని ప్రస్తుతం తొలగించేందుకు కుట్ర జరుగుతోందని, దీని వల్ల పాఠశాల స్థలం కబ్జాకు గురయ్యే ప్రమాదం ఉందని జెడ్పీటీసీ సభ్యురాలు ఈర్లె అనురాధకు శనివారం రాత్రి పలువురు గ్రామస్తులు తెలిపారు. దీంతో ఆమె కలెక్టర్, జిల్లా పరిషత్ సీఈవో, విద్యాశాఖ ఉన్నతాధికారులకు శనివారమే ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం పాత ప్రహరీని కూల్చివేయడంతో గ్రామస్తులు విస్మ యం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులకు హెచ్‌ఎం ఫిర్యాదు
పాఠశాల పాత ప్రహరీని గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం ఉదయం కూల్చివేశారని పాఠశాల హెచ్‌ఎం ఎస్.వి.పద్మావతి కె.కోటపాడు ఎస్‌ఐ ఆర్.ధనుంజయ్‌కు లిఖిత పూర్వకంగా ఆదివారం ఫిర్యాదు చేశారు. పాత ప్రహరీని కూల్చివేసిన సమాచారాన్ని పాఠశాలకు చెందిన వాచ్‌మెన్ రాంబాబు తనకు ఫోన్ ద్వారా ఇచ్చినట్టు ఆమె తెలిపారు. వెంటనే 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో పాటు కె.కోటపాడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు హెచ్‌ఎం స్థానిక విలేకరులకు తెలిపారు. ఈ ఘటనపై కేసును నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు ఎస్.ఐ ధనుంజయ్ చెప్పారు.
కూల్చివేత టీడీపీ నాయకుల పనే ..
పాత ప్రహరీని గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకులే కూల్చివేశారని వైఎస్సార్‌సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు సింగంపల్లి మురళీమోహన్, పాఠశాల పూర్వ విద్యార్థి డోకల అప్పలనాయుడు ఆరోపించారు. పాఠశాలకు చెందిన స్థలంలో షాపులను నిర్మించి, తమ బినామీలకు అప్పగించేందుకే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. రూ.10 కోట్లకు పైబడి విలువ గల హైస్కూల్ స్థలం అన్యాక్రాంతం కాకుండా చర్యలను తీసుకోవాలని పాఠశాల వద్ద వీరు నినాదాలు చేశారు. ఇప్పటికై నా పాఠశాలకు చెందిన స్థలాన్ని ఏ విధంగా రక్షించనున్నారో అధికారులు తెలియజేసి గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఉన్న ఆందోళనలను తొలగించాలని మురళీమోహన్, అప్పలనాయుడు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కణితి సాయికుమార్, లగుడు దేముడుబాబు, మేడపురెడ్డి త్రిమూర్తులు, కె.శివ పాల్గొన్నారు.


