చెరువుల్లో మట్టి జలగలు | - | Sakshi
Sakshi News home page

చెరువుల్లో మట్టి జలగలు

Apr 20 2026 8:35 AM | Updated on Apr 20 2026 8:35 AM

నర్సీపట్నం: చెరువులు కొంతమంది కూటమి నేతల ధనదాహానికి కరిగిపోతున్నాయి. అధికార యంత్రాంగం అండతో కొందరు ఇష్టమొచ్చినట్లు మట్టిని తరలిస్తూ అడిగే వారెవరంటూ రెచ్చిపోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చెరువు గర్భాల్లో మట్టి కూటమి నేతలకు వరంగా మారింది. నర్సీపట్నం రెవెన్యూ డివిజన్‌లో మట్టి దందా యథేచ్చగా సాగుతోంది. నర్సీపట్నం, మాకవరపాలెం, నాతవరం తదితర ప్రాంతాల్లో రాత్రీ పగలు అన్న తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా లోతుగా తవ్వకాలు చేస్తూ యథేచ్ఛగా తరలించేస్తున్నారు.

నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధి బయపురెడ్డిపాలెం రాయపురాజు చెరువు, అమలాపురం చెరువుల్లో పొక్లెయిన్‌లతో మట్టిని తవ్వి ట్రాక్టర్లలో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. చెరువు గర్భాల్లో లోతుగా మట్టిని తవ్వడంతో ప్రమాదకరమైన గోతులేర్పడుతున్నాయని ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డివిజన్‌ పరిధిలో వందలాది చెరువులు సాటునీటి మట్టి తవ్వకాలతో రూపాన్ని కోల్పోతున్నాయి. ఇంతజరుగుతున్నా ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. పరిసర ప్రాంతాలకు ఒక ట్రక్కు మట్టి తరలిస్తే రూ.వెయ్యి నుంచి రూ.1500 చొప్పున వసూలు చేస్తున్నారు.

తనిఖీలు మరిచిన రవాణాశాఖ..

ట్రాక్టరు రిజిస్ట్రేషన్‌ చేసుకునేటప్పుడు వ్యవసాయం, వాణిజ్య అవసరాల బట్టి పసుపు, తెలుపు నంబర్‌ ప్లేట్లు కేటాయిస్తారు. మట్టి తరలిస్తున్న వాటిలో సగానికిపైగా ట్రాక్టర్లకు నంబర్‌ ప్లేట్లు కనిపించడం లేదు. వీటిపై చర్యలు తీసుకోవాల్సిన రవాణాశాఖాధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రమాదాలు జరిగిన సమయంలోనే విచారణ చేస్తున్నారే తప్ప వాహనాల తనిఖీలు చేపట్టడం లేదు. వాహనదారులకు సరైన లైసెన్స్‌లు కూడా ఉండడం లేదు. వాహనంతో పాటు వాహనదారుడుకి సరైన పత్రాలులేకున్నా మట్టి వ్యాపారాలు మాత్రంగా జోరుగానే రవాణా చేస్తున్నారు. తెలుపు నంబరు ప్లేట్‌ ఉండే వాహనాలను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే చర్యలు తీసుకునే అధికారం ఉన్నా పట్టించుకోవటం లేదనే విమర్శలున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement