వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్
మునగపాక: పూడిమడక రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయిన తమకు టీడీఆర్ బాండ్లు కాకుండా పరిహారాన్ని నేరుగా బ్యాంక్ అకౌంట్‌లో జమచేయాల్సిందేనని నిర్వాసితులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. పరిహారాన్ని టీడీఆర్‌ల రూపంలో ఇస్తామనుకుంటే తామంతా కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమంటూ తెలిపారు. స్థానిక పీఏసీఎస్ కార్యాలయ ఆవరణలో మునగపాక, అచ్యుతాపురం మండలాల పరిధిలోని పూడిమడక రోడ్డువిస్తరణ బాధితులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఒంగోలులో ఇటీవల టీడీఆర్ బాండ్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇచ్చిందని, ఆమేరకు కోర్టును ఆశ్రయించాలని నిర్ణ యం తీసుకున్నారు. ఇందుకు నిర్వాసితులంతా ఒకే మాటపై ఉండాలని తీర్మానించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు,నిర్వాసితులు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ హయాంలో పూడిమడక రోడ్డుకు బీజం పడిందన్నారు. రహదారి విస్తరణకు అందరూ అంగీకరించారని తెలిపారు. పరిహారాన్ని నేరుగా అకౌంట్‌లో జమచేస్తామని అధికారులు హామీ ఇచ్చారన్నారు. ఇప్పుడు టీడీఆర్‌లు ఇస్తామంటూ ప్రకటించడం తగదని తెలిపారు. సాగునీటి కాలువలకు ఎటువంటి ప్రత్యామ్నాయం చూపకుండా మూసివేసే చర్యలు సరికాదన్నారు. సమావేశంలో నిర్వాసితులు ఆడారి గణపతి అచ్చియ్యనాయుడు, భీముని వెంకటేశ్వరరావు,కాండ్రేగుల జగ్గారావు,డాక్టర్ డి.డి. నాయుడు,మళ్ల సూరప్పారావు, దొడ్డి వరహా, పొలమరశెట్టి అప్పలనాయుడు, శరగడం జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు.


