జగనన్న దార్శనికత.. మత్స్యకారులకు భరోసా
● వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రూ.351.1 కోట్లతో మొగలో ఫిషింగ్ హార్బర్‌కు శ్రీకారం
● 30 ఎకరాలు భూ కేటాయింపు, సర్వే, టెండర్ ప్రక్రియ పూర్తి
● నిర్మాణం పూర్తయితే ఏటా 28,700 టన్నుల మత్స్య సంపద
● జిల్లాలో 16,400 మత్స్యకారుల కుటుంబాలకు లబ్ధి
● ప్రత్యక్షంగా, పరోక్షంగా పది వేల మందికి ఉపాధి
● అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా ఆ ఊసే ఎత్తని చంద్రబాబు ప్రభుత్వం
● కార్పొరేట్ శక్తులకు తీరాన్ని కట్టబెట్టే కుట్ర!
● ఆగితే సమరం తప్పదని మత్స్యకారుల హెచ్చరిక
పూడిమడక వద్ద తీరం
సాక్షి, అనకాపల్లి: ఇటు విశాఖ హార్బర్... అటు ఒడిశా పారాదీప్... మధ్యలో దాదాపు 200 కిలోమీటర్ల మేర ఎక్కడా ఫిషింగ్ హార్బర్ లేదు. తుపానులు, విపత్తులు వచ్చిన సందర్భాల్లో బోట్లను సురక్షితంగా హార్బర్‌కు తీసుకువచ్చేందుకు మత్స్యకారులు నరకం చూడాల్సిన పరిస్థితి. జిల్లాకు చెందిన మత్స్యకారులు ఎక్కువగా ఒడిశా వైపు వేటకు వెళతారు. విశాఖలోనే దాదాపు 700కి పైగా మెకనైజ్డ్ బోట్లు, 3వేల ఫైబర్ బోట్లు, 400 చిన్న పడవలు ఉండటంతో అక్కడి హార్బర్ సామర్థ్యం సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక సమీపాన మొగ ప్రాంతంలో రూ.393 కోట్లతో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే ఈ ఫిషింగ్ హార్బర్‌కు కూటమి ప్రభుత్వంలో ‘చంద్ర’ గ్రహణం పట్టింది. మత్స్యకారుల ఆశలపై నీళ్లు చల్లింది. ఉత్తరాంధ్ర తీరంలో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలని, వారి సొంత గడ్డపైనే గౌరవప్రదమైన ఉపాధి కల్పించాలని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పూడిమడక ఫిషింగ్ హార్బర్’ నేడు పాలకుల నిర్లక్ష్యానికి, కక్షసాధింపు రాజకీయాలకు సజీవ సాక్ష్యంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో శరవేగంగా అడుగులు పడి, వేల కోట్లతో తీర ప్రాంత ముఖచిత్రాన్ని మార్చేలా రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు, చంద్రబాబు ప్రభుత్వం రాకతో ఒక్కసారిగా అంధకారంలోకి వెళ్లిపోయింది. వేలాది మంది మత్స్యకారుల కలల సాకారం దిశగా అడుగులు వేయాల్సిన పాలకులు, నేడు కాలయాపన చేస్తూ వారి కడుపు కొడుతున్నారు.
గంగపుత్రుల గోడు పట్టదా?
పూడిమడక హార్బర్ పూర్తయితే దాదాపు 1,000 మెకనైజ్డ్ బోట్లు ఇక్కడ లంగరు వేసే అవకాశం ఉండేది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి పైగా ఉపాధి లభించేది. కానీ ఇప్పుడు పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. హార్బర్ నిర్మాణం ఆగిపోవడంతో వేట కోసం మత్స్యకారులు మళ్లీ గుజరాత్, ముంబై, చైన్నె వంటి ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. తమ సొంత ప్రాంతంలోనే హార్బర్ వస్తుందని ఆశపడిన గంగపుత్రులకు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం నిరాశే మిగిల్చింది. ‘సొంత ఊర్లో పని దొరుకుతుందని ఆశపడ్డాం, కానీ ఈ ప్రభుత్వం మా నోటికాడి కూడు తీసేస్తోంది‘ అని అనుకోలేదని స్థానిక మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సమరం తప్పదని మత్స్యకారుల హెచ్చరిక
‘జగనన్న హయాంలో హార్బర్ పనులు చూసి మా కష్టాలు తీరుతాయని ఆశ పడ్డాం. కానీ ఇప్పుడు పనులు ఆగిపోవడం చూస్తుంటే మా బతుకులతో ఆడుకుంటున్నారనిపిస్తోంది’ అని పూడిమడక వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పూడిమడక హార్బర్ పనులను యుద్ధ ప్రాతిపదికన పునఃప్రారంభించకపోతే, రాబోయే రోజుల్లో తీర ప్రాంతమంతా ఏకమై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని మత్స్యకార నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం తన మొండివైఖరిని వీడి, రాజకీయాలకు అతీతంగా పూడిమడక హార్బర్ నిర్మాణాన్ని పూర్తి చేసి, ఉత్తరాంధ్ర గంగపుత్రులను ఆదుకోవాలి. లేదంటే గంగమ్మ తల్లి సాక్షిగా ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడం ఖాయమని వారు చెబుతున్నారు.
విశాఖ హార్బర్‌పై తగ్గనున్న భారం..
పూడిమడకలో హార్బర్ నిర్మాణం పూర్తయితే.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌పై భారం తగ్గనుంది. చాలా వరకూ బోట్లు.. ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తారు. కేవలం పూడిమడక మాత్రమే కాకుండా.. పాయకరావుపేట, ఎస్.రాయవరం, రాంబిల్లి, పరవాడ ప్రాంత మత్స్యకారులకు కూడా చాలా ప్రయోజనాలు కలగనున్నాయి.
కార్పొరేట్ శక్తులకు తీరాన్ని కట్టబెట్టే కుట్ర?
అభివృద్ధి ముసుగులో ఈ ప్రాంతాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకే చంద్రబాబు ప్రభుత్వం హార్బర్ పనులను కావాలనే తొక్కిపెడుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జువ్వలదిన్నె వంటి హార్బర్లను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని చూస్తున్న ఈ ప్రభుత్వం, పూడిమడకను కూడా అదే బాటలో నడిపించి మత్స్యకారులను కూలీలుగా మార్చాలని చూస్తోందని విమర్శలు వస్తున్నాయి. తీర ప్రాంత సంపదను పచ్చ చొక్కాల నేతలకు దోచిపెట్టడమే లక్ష్యంగా పాలన సాగుతోందని విపక్షాలు మండిపడుతున్నాయి.
మత్స్యకారుల కష్టాలను కళ్లారా చూసిన నాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ిఫిషింగ్ హార్బర్లు నిర్మించాలని నిర్ణయించుకున్నారు. వేట కోసం పక్క రాష్ట్రాలకు వలస వెళ్తూ, ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతూ, అనాథలుగా మారుతున్న మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా 10 కొత్త ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే అచ్యుతాపురం మండలంలోని పూడిమడక సమీపంలో మొగ వద్ద సుమారు రూ.393 కోట్ల అంచనా వ్యయంతో భారీ ఫిషింగ్ హార్బర్‌కు పచ్చజెండా ఊపారు. ఢిల్లీకి చెందిన వాప్కోస్ (వాటర్ అండ్ పవర్ కన్సెల్టెన్సీ సర్వీసెస్ లిమిటెట్) సంస్థ సర్వే చేసి ఇక్కడి ప్రాంతం హార్బర్ ఏర్పాటుకు అనుకూలంగా ఉందని స్పష్టం చేసింది. దీంతో నిధుల కేటాయింపు, భూసేకరణ పనులు, పర్యావరణ అనుమతులన్నీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హయాంలో చకచకా జరిగిపోయాయి. జిల్లాలో అతి పెద్ద మత్స్యకార గ్రామమైన పూడిమడకలో 18 వేల మందికిపైగా జనాభా ఉండగా. 16,400 మంది చేపలవేటపైనే జీవనం సాగిస్తున్నారు. ఈ హార్బర్‌నిర్మాణం తర్వాత మత్స్యకారులతో పాటు వివిధ వృత్తులకు చెందిన ఐదువేల కుటుంబాలకు ఉపాధి లభిస్తుంది. ఈ గ్రామ పరిధిలో మొత్తం 340 రిజిస్టర్ బోటులున్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని హార్బర్ కోసం ఎంపిక చేశారు. ఇక్కడ నిర్మించనున్న హార్బర్‌లో 930 బోట్లు నిలిపేందుకు వీలుగా ప్రతిపాదనలు రూపొందించారు. 700 వరకూ 9 మీటర్ల మోటరైజ్డ్ బోట్లు, 200 వరకూ 18 మీటర్ల మెకనైజ్డ్ బోట్లు, 30కి పైగా 24 మీటర్ల టూనా లాంగ్ లైనర్లను ఇక్కడి నుంచి ఆపరేట్ చేసే అవకాశం కలగనుంది. ఏడాదికి 28వేల టన్నుల వరకూ మత్స్య సంపద నిర్వహణ సామర్థ్యం ఉండేలా ఫిషింగ్ హార్బర్ నిర్మాణం ఏర్పాటుచేసేందుకు పనులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం మారగానే మత్స్యకారుల తల రాత కూడా మారిపోయింది. చంద్రబాబు నేతత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హార్బర్ ఊసే ఎత్తడం లేదు.


