యథేచ్ఛగా మట్టి అక్రమ తరలింపు | - | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా మట్టి అక్రమ తరలింపు

Apr 19 2026 7:35 AM | Updated on Apr 19 2026 7:35 AM

అడ్డుకున్న ఆయకట్టుదారులు

నర్సీపట్నం : పంటలకు మట్టే ఆధారం..ఇదే మట్టి అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధి బయపురెడ్డిపాలెం గ్రామంలోని రాయపురాజు చెరువులో మట్టిని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కూటమి నేత ఇటుకల బట్టీకి చెరువులోని మట్టిని కొద్దిరోజులుగా పొక్లెయిన్‌తో తవ్వి సుమారు 12 ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. యథేచ్ఛగా ఈ దందా సాగుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోలేదు. ఇళ్లు నిర్మించుకునేందుకు మట్టి దొరక్క సామాన్యులు అనేక ఆగచాట్లు పడుతున్నారు. ఇదే సందర్భంగా కూటమి నేతలు మాత్రం పెద్ద ఎత్తున చెరువు గర్భంలోని మట్టిని కొల్లగొడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బయపురెడ్డిపాలెం మాజీ కౌన్సిలర్‌, వైఎస్సార్‌సీపీ నాయకుడు బయపురెడ్డి చినబాబు, కొంత మంది ఆయకట్టు రైతులు చెరువులో నుంచి మట్టిని తరలిస్తున్న ట్రాకర్లను అడ్డుకున్నారు. చెరువు గర్భంలో మట్టిని తీస్తున్న పొక్లెయిన్‌ను నిలుపుదల చేశారు. అక్కడ నుండే రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులకు మాజీ కౌన్సిలర్‌ ఫోన్‌ చేశారు. గంటల తరబడి వాహనాలను నిలుపుదల చేసినప్పటికీ అధికారులు స్పందించలేదు. మట్టి తరలిస్తున్న కూటమి నాయకులకు, చినబాబుకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. మట్టి తరలించాలంటే ముందుగా ఇరిగేషన్‌శాఖ అధికారుల అనుమతులు పొందాలి, కమర్షియల్‌కు అవసరాలకు మట్టిని వినియోగించకూడదు. ఈ నిబంధనలు తుంగలో తొక్కి ఇటుక బట్టిలకు మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ మట్టి దందాపై కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్తానని మాజీ కౌన్సిలర్‌ చినబాబు పేర్కొన్నారు. ఈ విషయమై ఇరిగేషన్‌ ఏఈ రామన్నపాత్రుడుని వివరణ కోరగా చెరువులోని మట్టిని తీసుకువెళ్లాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలి. ఆ చెరువులో మట్టిని తవ్వేందుకు తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని ఏఈ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement