అచ్యుతాపురం రూరల్: అచ్యుతాపురం కేజీబీవీలో విద్యార్థిని నవ్య (12) శనివారం మృతిచెందిన ఘటనపై విచారణకు త్రిసభ్య కమిటీని నియమించారు. పాఠశాలను ఆదివారం కేజీబీవీ స్టేట్ సెక్రటరీ దేవానంద్ రెడ్డి, ఆర్‌జేడీ విజయ్ భాస్కర్, డీఈవో గిడ్డి అప్పారావు నాయుడు సందర్శించి, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థిని మృతిపై సిబ్బంది, విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై విచారణకు కేజీబీవీ జీసీడీవో, జిల్లా ఇన్‌చార్జ్ జెన్నిమ, యలమంచిలి డిప్యూటీ డీఈవో అప్పారావు, సీనియర్ ఎంఈవో బి.రజినీదేవితో కూడిన కమిటీని నియమించారు. ఈ సందర్భంగా డీఈవో అప్పారావు నాయుడు కేజీబీవీ సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఎటువంటి విష కీటకాలు పాఠశాల ఆవరణలోకి ప్రవేశించకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా వెంటనే వైద్య సేవలు అందేలాచూడాలని ఆదేశించారు. పాఠశాలలో పరిస్థితి చక్కబడే వరకూ విద్యార్థినులు ఇళ్లకు వెళ్లేందుకు సెలవులు ప్రకటించారు.
రూ.10 లక్షల పరిహారం
మృతి చెందిన విద్యార్థిని మైలపల్లి నవ్య కుటుంబానికి కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఆదేశాల మేరకు ఆదివారం రూ.10లక్షలు చెక్కును అచ్యుతాపురం తహసీల్దార్ శ్రీను, సీఐ చంద్రశేఖర్ రావు అందజేసినట్లు ఎంఈవో కృష్ణ దేవరాయల్ స్థానిక విలేకరులకు తెలిపారు.
పాఠశాల సిబ్బంది సస్పెన్షన్
ఈ ఘటనకు సంబంధించి కేజీబీవీ ప్రిన్సిపాల్ ఉమాదేవి, ఎన్‌ఎస్ టీచర్ సునీత, ఎస్.రూప(వృత్తివిద్య), వాచ్‌మెన్ సీహెచ్ చిలకమ్మ, ఏఎన్‌ఎం జి.ఈశ్వరిని శనివారం రాత్రి డీఈవో అప్పారావు నాయుడు సస్పెండ్ చేశారు.
నవ్య అంత్యక్రియలు పూర్తి
విశాఖ కేజీహెచ్‌లో పోస్టుమార్టం పూర్తిచేసిన అనంతరం ఆదివారం స్వగ్రామమైన పూడిమడక శివారు కడపాలెంలో అశ్రునయనాల మధ్య నవ్య అంత్యక్రియలు నిర్వహించారు. తోటి విద్యార్థులు, స్నేహితులు, పాఠశాల సిబ్బంది నివాళులర్పించారు.
కేజీబీవీని సందర్శించిన
కేజీబీవీ స్టేట్ సెక్రటరీ, ఆర్‌జేడీ, డీఈవో


