పకడ్బందీగా ఏర్పాట్లు సామాన్య భక్తులకే పెద్దపీట సులభంగా అప్పన్న దర్శనం
మీడియా సమావేశంలో దేవస్థానం ఈవో వెంకటరావు
సింహాచలం: సింహాచల పుణ్యక్షేత్రంలో అత్యంత ముఖ్యమైన చందనోత్సవ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు తక్కువ నడకతో సులభతర దర్శనం కల్పించేలా ప్రణాళికలు రూపొందించారు. ఈసారి సామాన్య భక్తులు గతంలో వలె 6 కిలోమీటర్లు కాకుండా, కేవలం 2.5 కిలోమీటర్లు మాత్రమే నడిచేలా మార్గాలను క్రమబద్ధీకరించారు. అదేవిధంగా రూ. 300, రూ. 1000, రూ. 1500 టిక్కెట్ల భక్తులకు కూడా నడక దూరాన్ని తగ్గించినట్టు ఈవో జల్లేపల్లి వెంకటరావు పేర్కొన్నారు. ఆదివారం సింహాచలం పరిపాలనా భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు.
టికెట్లు ..దర్శన వేళలు:
దర్శనం టికెట్లను 70 శాతం ఆన్‌లైన్ ద్వారా, 30 శాతం ఎంపిక చేసిన యూనియన్ బ్యాంక్, ఎస్‌బీఐ శాఖల ద్వారా విక్రయిస్తున్నారు. భక్తులు దళారులను నమ్మి మోసపోవద్దని, కేవలం అధికారిక మార్గాల్లోనే టిక్కెట్లు పొందాలని ఈవో వెంకటరావు సూచించారు. టికెట్లపై కేటాయించిన టైమ్ స్లాట్ ప్రకారం వస్తేనే దర్శనానికి అనుమతి ఉంటుంది. 20వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు వంశపారపర్య ధర్మకర్త తొలి దర్శనం తర్వాత, ప్రభుత్వం, టీటీడీ తరపున పట్టువస్త్రాల సమర్పిస్తారని ఈవో తెలిపారు.అనంతరం ఉదయం 4 గంటల నుంచి వీవీఐపీలకు, ఆ తర్వాత సామాన్య భక్తులకు దర్శనాలు కల్పిస్తారు.
రవాణా– పార్కింగ్ సదుపాయాలు
భక్తుల తరలింపు కోసం 70 ఆర్టీసీ బస్సులను కేటాయించారు. ఈసారి కొండపైకి ప్రైవేటు ఏసీ బస్సులను అనుమతించడం లేదు. అందరూ ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్లాల్సి ఉంటుంది. కొండ దిగువన 5 పికప్ పాయింట్లు, 32 పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. గోశాల నుంచి శ్రీనివాస కల్యాణ మండపం వరకు ఉచిత షటిల్ బస్సులు నడపనున్నారు. 19వ తేదీ సాయంత్రం 6 గంటల నుండే కొండపైకి ప్రైవేటు వాహనాల రాకపోకలను నిలిపివేస్తామని ఈవో వెంకటరావు తెలిపారు.
భక్తుల సౌకర్యాలు– భద్రత
ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని 4 లక్షల వాటర్ బాటిళ్లు, లక్ష బిస్కెట్ ప్యాకెట్లు, పంపిణీ చేయనున్నారు. చిన్న పిల్లల కోసం గోరువెచ్చని పాలను అందుబాటులో ఉంచుతున్నారు. పారిశుధ్యం కోసం జీవీఎంసీ సహకారంతో భారీగా మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. భద్రత పరంగా ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో పాటు పోలీస్ నిఘా పటిష్టంగా ఉంటుంది. భక్తులకు మార్గనిర్దేశం చేసేందుకు క్యూఆర్ కోడ్‌తో కూడిన రూట్ మ్యాప్‌ను ప్రవేశపెట్టారు.
ప్రసాదం..ఇతర సేవలు
దర్శనం ముగించుకున్న భక్తుల కోసం లక్షన్నర చిన్న లడ్డూలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. కొండ దిగువన అదనంగా మరో లక్ష లడ్డూలను విక్రయానికి ఉంచుతామని ఈవో వెంకటరావు పేర్కొన్నారు. పిఠాపురానికి చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా భక్తులందరికీ అన్నప్రసాద వితరణ జరుగుతుంది. భక్తులు సాధ్యమైనంత వరకు మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకురావద్దని, ప్రతి పార్కింగ్ వద్ద చెప్పులు భద్రపరుచుకునే ఉచిత సౌకర్యం ఉంటుందని ఈవో స్పష్టం చేశారు.
70 శాతం టికెట్లు ఆన్‌లైన్‌లోనే..


