యలమంచిలి రూరల్: యలమంచిలి రైల్వేస్టేషన్ సమీపంలో డౌన్‌లైన్‌లో గుర్తు తెలియని రైలు ఢీకొని ఆదివారం ఓ వ్యక్తి మృతి చెందినట్టు తుని ప్రభుత్వ రైల్వే పీఎస్ ఎస్‌ఐ జి.శ్రీనివాసరావు తెలిపారు.ఇక్కడ రైల్వే ట్రాక్ పక్కన నుజ్జునుజ్జైన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం గుర్తించిన స్థానిక రైల్వే సిబ్బంది తుని రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఈ మేరకు అక్కడకు చేరుకున్న రైల్వే పోలీసులు పురుషుని మృతదేహంగా నిర్థారించారు. పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీకొని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.మృతుని వయస్సు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని, చామనఛాయ రంగులో ఉన్న మృతుడు నలుపు రంగు జీన్ ప్యాంటు,పసుపు రంగు హాఫ్ హ్యాండ్స్ చొక్కా,గోధుమ రంగు చెప్పులు ధరించి ఉన్నాడని, ఎరుపు రంగు మొలతాడుకు రెండు తాళం చెవులున్నాయని రైల్వే ఎస్‌ఐ తెలిపారు.మృతుని చిరునామా,ఇతర వివరాలు ప్రమాద స్థలంలో లభించలేదని, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.మృతదేహాన్ని తుని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. వివరాలు తెలిసిన వారు తుని ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ఫోన్ నెంబర్ 9247585731కు సంప్రదించవచ్చు.


