నక్కపల్లి : విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ మంజూరు చేయాలని ఆమరణ నిరాహార దీక్ష చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్‌పై గత తెలుగుదేశం ప్రభుత్వం రాజకీయ కక్షతోనే కేసులు బనాయించిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ ఆరోపించారు. శ శనివారం ఆయన చందనాడలో విలేకర్లతో మాట్లాడుతూ విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ తీసుకు రావాలని, విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని అమర్ ఉత్తరాంధ్ర ప్రజల తరపున పోరాటం చేసారన్నారు. వెనుకబడిన ఉత్తరాంద్రకు న్యాయం చేయాలని ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఆందోళన చేసిన అమర్‌పై అప్పటి తెలుగు దేశం ప్రభుత్వం కక్షసాదింపుచర్యలకు పాల్పడిందన్నారు. శాంతియుతంగా ఆందోళన చేసిన అమర్‌పై అక్రమ కేసులు బనాయించి దీక్షను భగ్నం చేయించిందన్నారు. ఉత్తరాంధ్రపై టీడీపీ ప్రభుత్వానికి చిన్నచూపు ఉందన్నారు. రైల్వేజోన్ వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశ్యంతో ఆందోళన చేసారన్నారు. అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం రైల్వే జోన్ సాధించకపోగా జోన్ సాధన కోసం పోరాటం చేసిన నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైలు శిక్షపడేలా చేసిందన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం చేసే పోరాటాలను రాజకీయ కోణంలో చూసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు వివపడకుండా నొక్కేయాలన్న కుట్రలు జరుగుతున్నాయన్నారు. తమను వ్యతిరేకించిన వారిని కేసులు పెట్టి వేధించడం చంద్రబాబు ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ప్రజాస్వామ్యం అపహాస్యం చేస్తున్నారన్నారు. ఈ విధానం మార్చుకోవాలన్నారు. కోర్టులంటే ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీకి గౌరవం ఉందన్నారు. తీర్పును శిరసావహిస్తామని న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు గొర్ల గోవిందరావు, వైస్‌ఎంపీపీ వెలగా ఈశ్వరరావు, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు పొడగట్ల పాపారావు, నియోజకవర్గ ప్రచార విభాగం అధ్యక్షుడు కొప్పిశెట్టి హరిబాబు, చీడిక రిజర్వాయర్ నీటి సంఘం ఉపాధ్యక్షుడు కరణం ఈశ్వరరావు, పార్టీ కార్యదర్శి సాదిరెడ్డి శ్రీను, మాజీ సర్పంచ్ తళ్ల భార్గవ్, నాయకులు పోతంశెట్టి బాబ్జి, మైలపల్లి సూరిబాబు ఉన్నారు.


