నిందితులకు శిక్ష పడటంలో పీపీలదే కీలక పాత్ర | - | Sakshi
Sakshi News home page

నిందితులకు శిక్ష పడటంలో పీపీలదే కీలక పాత్ర

Apr 12 2026 3:00 AM | Updated on Apr 12 2026 3:00 AM

బీచ్‌రోడ్డు: వెట్టి చాకిరీ, మానవ అక్రమ రవాణా వంటి సామాజిక అన్యాయాలను సమూలంగా నిర్మూలించడంలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల పాత్ర అత్యంత కీలకమని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. శనివారం నగరంలోని ఒక హోటల్‌లో నిర్వహించిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల సామర్థ్య పెంపుదల వర్క్‌షాప్‌లో ఆమె మాట్లాడారు. పోలీసు శాఖ చార్జిషీటు దాఖలు చేసిన దశ నుంచే ప్రాసిక్యూటర్లు చురుకై న పాత్ర పోషిస్తేనే నిందితులకు కఠిన శిక్షలు పడతాయని పేర్కొన్నారు. నేరం జరిగిన వెంటనే గోల్డెన్‌ అవర్‌లో ఫోరెన్సిక్‌ సాక్ష్యాధారాలను సేకరించడం ద్వారా కన్విక్షన్‌ రేటు పెరుగుతుందని వివరించారు. ఆపరేషన్‌ ట్రేస్‌లో భాగంగా 900 మంది పిల్లలను, వివిధ దేశాల్లో చిక్కుకున్న మరో 180 మందిని రక్షించామని తెలిపారు. ఇదే దృఢసంకల్పంతో పోలీసులు, ప్రాసిక్యూటర్లు సమన్వయంతో పని చేయాలని సూచించారు. దర్యాప్తులో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి ఆధునిక సాంకేతికత వినియోగాన్ని పెంచాలని, దీనిపై పోలీసు శాఖలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. వెట్టి చాకిరీ నుంచి విముక్తి పొందిన బాధితులకు కేంద్ర ప్రభుత్వం రూ.30,000 ఆర్థిక సహాయం అందించడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని పేర్కొన్నారు. నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ.. కేసు నమోదు నుంచి విచారణ ముగిసే వరకు బాధితుల హక్కులను కాపాడటంలో పోలీసులు, ప్రాసిక్యూషన్‌, న్యాయవ్యవస్థ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా చూడటంతో పాటు, బాధితుల పునరావాసంపై మానవీయ దృక్పథంతో చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం వివిధ కేసుల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను మంత్రి అనిత సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రాసిక్యూషన్‌ డైరెక్టర్‌ రామకోటేశ్వరరావు, ఐజేఎం స్టేట్‌ ప్రోగ్రాం డైరెక్టర్‌ క్లెమెంట్‌ డేవిడ్‌, వివిధ జిల్లాల పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

వర్క్‌షాప్‌లో మంత్రి వంగలపూడి అనిత

Advertisement
 
Advertisement
Advertisement