సాగని వేట.. కన్నీటి ఊట | - | Sakshi
Sakshi News home page

సాగని వేట.. కన్నీటి ఊట

Apr 11 2026 8:04 AM | Updated on Apr 11 2026 8:04 AM

మత్స్యశాఖ అధికారులు... వేటదారుల కడుపుకొట్టారు. వారి బతుకులతో చెలగాటమాడారు... సంక్షేమానికి కృషి చేయవలసిన వారే సంక్షోభం సృష్టించారు. దీంతో పలు కుటుంబాలు అర్ధాకలితో అలమటించవలసి వస్తోంది.. రైవాడ జలాశయంలో 5 లక్షల చేపపిల్లలకు గాను కేవలం వేల సంఖ్యలో వేశారు.. వాటిలో సగం వేయకముందే చనిపోయాయి.. దీంతో చేప చిక్కక.. బక్కచిక్కిన బతుకులు మరింత దైన్యంగా మారాయి.

దయనీయంగా ‘రైవాడ జలాశయం’ వేటదారుల పరిస్థితి

చేప పిల్లలు విడుదలలో మత్స్యశాఖ అధికారుల మాయాజాలం

సక్రమంగా విడుదల చేయకపోవడంతో కానరాని మత్స్య సంపద

రోజంతా వేట సాగించినా కిలో చేపలు చిక్కడం గగనం

250 మంది వేటదారుల కుటుంబాల జీవనోపాధికి గండి

దేవరాపల్లి: మత్స్యశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైవాడ జలాశయంలో చేపల వేట సాగిస్తూ జీవనోపాధి పొందుతున్న వేటదారులు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చేప పిల్లలు విడుదలలో మత్స్యశాఖ అధికారులు ప్రదర్శించిన మాయాజలం స్థానిక వేటదారుల పాలిట శాపంగా మారింది. గత ఏడాది జలాశయంలో చేప పిల్లలు సక్రమంగా విడుదల చేయకపోవడంతో మత్స్య సంపద తగ్గిపోయింది. బోటుపై రోజంతా కష్టపడి వేట సాగించినా కిలో చేపలు దొరకడం గగనంగా మారింది. దీంతో సుమారు 250 మంది వేటదారులు ఇటు వేట సాగక, అటు పూట గడవక నానా అవస్థలు పడుతున్నారు. మండుటెండలో ఎంతో కష్టపడి రోజంతా వేట సాగించిన కనీసం రూ.200 విలువ చేసే చేపలు లభించడం లేదు. గత ఏడాది వరకూ జీవనోపాధికి ఇబ్బంది లేకుండా చేపలు లభించేవి. ఈ ఏడాది చేపలు లభించకపోవడంతో పలు కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయి. ప్రతీ ఏటా మత్స్యశాఖ అధికారులు వివిధ స్కీంలు కింద రెండు విడతలుగా జలాశయంలో సుమారు 10 లక్షల వరకు చేప పిల్లలు విడుదల చేసే వారు. గత ఏడాది చేప పిల్లలు విడుదలలో అధికార్లు ప్రకటించిన లెక్కకు, తెచ్చిన పిల్లలకు భారీ వ్యత్యాసం ఉండటాన్ని గమనించిన వేటదార్లు ఆందోళనకు దిగడంతో మోసం బయటపడింది.

చేప పిల్లల విషయంలో వేటదారుల నిరసన

గత ఏడాది నవంబర్‌ 24న జలాశయంలో ఐదు లక్షల చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన అధికారులు కేవలం 50 వేలు మాత్రమే వేసి వేటదారులను బురిడీ కొట్టించారు. అధికారుల మోసాన్ని నిరసిస్తూ అదే రోజు రైవాడ సచివాలయం ఎదుట వేటదారులు ఆందోళనకు దిగారు. దీంతో 50 వేల పిల్లలనే వేసినట్లు మత్స్యశాఖ అధికార్లు అంగీకరించి, మిగిలిన 4.50 లక్షల చేప పిల్లలను 15 రోజుల్లో వేస్తామని లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చారు. ఎట్టకేలకు రెండు నెలల తర్వాత ఈ ఏడాది జనవరి 9న 1.50 లక్షల పిల్లలను మాత్రమే తీసుకురావడంతో మళ్లీ వేటదారులు ఆందోళనకు దిగారు. ఇచ్చిన హామీని పట్టించుకోకుండా అరకొరగా తీసుకువచ్చి మోసగించేందుకు ప్రయ త్నించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఉదయం 10 గంటలకు వస్తాయని చెప్పి సాయంత్రం 4 గంటలకు తీసుకురావడంతోనే చేప పిల్లలు చనిపోయాయి. చనిపోయిన చేప పిల్లలను జలాశయంలో వేయవద్దని వేటదార్లు చెప్పినా పట్టించుకోకుండా వేయడంతో నీటిపై తేలిపోయాయి.

ఈ వివాదంపై జిల్లా మత్స్యశాఖ అధికారి వి.విజయ స్పందించి చనిపోయిన చేప పిల్లలతో సంబంధ లేకుండా నాలుగు లక్షల చేప పిల్లలను వేస్తామని హామీ ఇచ్చారు. సుమారు మూడు నెలలు దాటిపోతున్నా పట్టించుకోక పోవడంపై వేటదార్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేపల వేటపై ఆధారపడిన తామంతా ఎలా బతకాలని వారు గోడు వెల్లబోసుకుంటున్నారు. కాగా గతంలో ఈ సీజన్‌లో విరివిగా చేపలు దొరికేవి. ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. రోజంతా కష్టపడినా కనీసం రూ.200 సంపాదన కూడా లభించకపోవడంతో అవస్థలు పడుతున్నామని చెప్పారు.రైవాడ జలాశయంలో చేప పిల్లలు రుచికరంగా ఉండటంతో గిరాకీ ఎక్కువగా ఉంటుంది. విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల నుంచి చేపల ప్రియులు వచ్చి పోటీ పడి మరీ కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ ఏడాది పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది.

రైవాడ జలాశయంలో చేపల వేట సాగిస్తున్న వేటదార్లు

మోసగించడం దారుణం

రైవాడ జలాశయంపై గత 20 ఏళ్లుగా చేపల వేట సాగిస్తూ జీవనోపాధి పొందుతున్నాం. చేప పిల్లలను వేలల్లో తెచ్చి, తమకు లక్షల్లో తెచ్చినట్లు చెప్పి మోసగించాలని ప్రయత్నించడం దారుణం. గతంలో ఎప్పుడూ తమను ఇలా మోసగించలేదు. ఈ మోసాన్ని గుర్తించి రెండు మార్లు ఆందోళనకు దిగడంతో అధికారులు హామీ ఇచ్చి పట్టించుకోక పోవడం అన్యాయం. వేట సాగితే గాని, పూట గడవని తమ జీవితాలతో చెలగాటం ఆడటం మంచిది కాదు. ఇప్పటికై నా అధికార్లు స్పందించి గతంలో చెప్పిన మాట ప్రకారం చేప పిల్లలు విడుదల చేయాలి.

– చల్లా రమణ, వేటదారుడు, రైవాడ

వేటదారులను ఆదుకోవాలి

జలాశయంలో చేప పిల్లలను విడుదల చేయకపోవడంతో మత్స్య సంపద తగ్గిపోయింది. రోజంతా కష్టపడి వేట చేసినా వలకు చేపలు చిక్కడం లేదు. మండుటెండలో వేటసాగిస్తే శ్రమే మిగిలుతోంది. గతంలో రెండు మార్లు చేప పిల్లలు తక్కువగా తేవడంతో గుర్తించి ఆందోళన చేశాం. అధికారులు దిగి వచ్చి ముందుగా ప్రకటించిన విధంగా చేప పిల్లలను వేస్తామని, ఈ ఏడాది జనవరి 9న ప్రకటించారు. మూడు నెలలు దాటి పోతున్నా అతీగతీ లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలి.

–కొమర నాగేంద్రకుమార్‌, వేటదారుడు, రైవాడ

స్కీం ముగిసింది

చేప పిల్లలు సరఫరా చేసే స్కీం ముగిసిపోయింది. ప్రస్తుతం చేప పిల్లలు అందుబాటులో లేవు. మళ్లీ జూలైలో చేప పిల్లల పెంపక కేంద్రం నుంచి సరఫరా చేస్తాం. ఈ ఏడాది రైవాడ జలాశయానికి తొలి ప్రాధాన్యత కల్పిస్తాం. ఆ తర్వాత మిగిలిన జలాశయాలకు కేటాయిస్తాం.

– జి.విజయ, జిల్లా మత్స్యశాఖ అధికారి,

అనకాపల్లి

Advertisement
 
Advertisement
Advertisement