నక్కపల్లి: అటెండర్లతో కారు తుడిపించడం, కార్యాలయ సిబ్బంది,ప్రజాప్రతినిధుల పట్ల నిర్లక్ష్యధోరణితో వ్యవహరించడం పాలనావ్యవహారాల్లో బంధువుల జోక్యం మితిమీరడం తదితర కారణాల వల్ల నక్కపల్లి ఎంపీడీవో బి.చైతన్యపై బదిలీవేటు పడింది.ఈమె వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు రావడంతో బదిలీచేయించాలని టీడీపీలో ఒకవర్గం, నిలుపుదల చేయించాలని మరో వర్గం తీవ్రప్రయత్నాలు చేశాయి. చివరకు మంత్రివద్ద పలుకుబడి గల ఒక కీలక నేత తన పంతం నెగ్గించుకుని ఈమైపె బదిలీ వేటు వేయించారన్న ప్రచారం జరుగుతోంది. ఎంపీడీవో వ్యవహార శైలిపై మండలపరిషత్‌లో గాడితప్పుతున్న పాలన అనే శీర్షికన జనవరి13వ తేదీన‘సాక్షి’లో కథనం వెలువడింది. దీనిపై స్పందించిన అధికారులు ఎంపీడీవోకు షోకాజ్‌నోటీసు కూడా ఇచ్చారు. చైతన్య నాలుగునెలల క్రితమే ఇక్కడ ఎంపీడీవోగా విధుల్లో చేరారు. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆమె ఒంటెద్దుపోకడలకు పాల్పడుతున్నారు. కార్యాలయంలో పనిచేసే సహచర ఉద్యోగులను చులకనగా చూడటం,నాల్గోతరగతి సిబ్బందితో వెట్టిచాకిరీ చేయించడం వంటి విమర్శలు ఎదుర్కొన్నారు. కార్యాలయానికి వచ్చే ప్రజాప్రతినిధుల పట్ల అమర్యాదగా వ్యవహరించడం వంటి ఆరోపణలను ఎదుర్కొన్నారు. దళిత వర్గానికి చెందిన అటెండర్‌తో కారు తుడిపించిన ఘటన వివాదానికి దారితీసింది. అటెండర్ ఎంపీడీవో కారు తుడుస్తున్న వీడియోలు, ఫొటోలు వైరల్ అయ్యాయి. దీనిపై వేంపాడు ఎంపీటీసీ సభ్యుడు కుంచా మధు... హోంమంత్రి అనితకు, జెడ్పీ సీఈవోకు ఫిర్యాదు చేశారు. అటెండర్‌లతో కారు తుడిపించడం అనేది జాబ్‌చార్ట్‌లో ఉందని ఎంపీడీవో సమర్థించుకున్నారు. దీనిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసి ఎంపీడీవోకు షోకాజ్‌నోటీసు ఇచ్చారు. బోరు మెకానిక్‌ల జీతాలు సకాలంలో చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేశారు. ఎంపీడీవో సమీప బంధువు కార్యాలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, పంచాయతీల తనిఖీల సందర్భంలో ఇతను కూడా పాల్గొనడం వంటి ఆరోపణలను అధికారపార్టీ నాయకులు, జిల్లా ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. గురువారం ఈమెను జిల్లాపరిషత్ కార్యాలయానికి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.తన బదిలీని నిలుపుదల చేయించుకునేందుకు ఎంపీడీవో చైతన్య టీడీపీలో ఒకవర్గం ద్వారా తీవ్ర ప్రయత్నాలు చేశారు.అయితే నియోజకవర్గ పార్టీలో కీలక పాత్రపోషిస్తున్న ఒక నేత ఈమెను ఎట్టిపరిస్థితుల్లో ఇక్కడనుంచి పంపించేయాలన్న పట్టుదలతో పావులు కదిపి బదిలిచేయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఎంపీడీవో బదిలీ ద్వారా సదరు నేత మంత్రి వద్ద తన పలుకు బడిని మరోసారి నిరూపించుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈమె స్థానంలో డిప్యూటీ ఎంపీడీవో చలపతిరావును ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఆయన బాధ్యతలు చేపట్టారు.
పాయకరావుపేట ఎంపీడీవోను కూడా...
పాయకరావుపేట ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన విజయలక్ష్మిని సైతం అధికారులు బదిలీచేశారు. ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజులకే ఆమెను అరకులోయకు బదిలీచేస్తూ జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీచేయడం చర్చనీయాంశమైంది.ఈ మె పనితీరు పట్ల కలెక్టర్ తీవ్ర అసంతృప్తితో ఉండడమే కారణంగా తెలుస్తోంది.
నక్కపల్లి తహసీల్దార్‌దీ అదే పరిస్థితి..
నక్కపల్లి తహసీల్దార్‌గా నెలరోజుల క్రితం నియమితులైన శ్రీనును అధికారులు బదిలీ చేశారు. ఇతని స్థానంలో సబ్బవరం తహసీల్దార్ గా పనిచేస్తున్న చిన్నికృష్ణను నియమించారు. నెలరోజుల వ్యవధిలో తహసీల్దార్‌ను బదిలీ చేయడం పై సర్వత్రా చర్చనీయాంశమైంది.


