బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం | - | Sakshi
Sakshi News home page

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం

Apr 11 2026 8:04 AM | Updated on Apr 11 2026 8:04 AM

● ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా ● జిల్లా శిశు సంక్షేమ శాఖ డైరెక్టరు సూర్యలక్ష్మి

నాతవరం: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని జిల్లా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఎన్‌.సూర్యలక్ష్మి అన్నారు. మండల కేంద్రం నాతవరంలో శుక్రవారం పోషణ్‌ పక్వాడ 8వ విడత కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఆమె పోస్టరు ఆవిష్కరించారు. ముందుగా స్థానిక ఐసీడీఎస్‌ అధికారులు, అంగన్‌వాడీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన చిరు ధాన్యాలతో తక్కువ పెట్టుబడితో అధిక పోషకాలు ఉండే వంటకాల స్టాల్‌ను ఆమె పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సూర్యలక్ష్మి మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘించి బాల్య వివాహాలు చేస్తే రెండేళ్ల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధిస్తామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు విటమిన్లు ఉండే ఆహారం అందించాలన్నారు. పిల్లలను స్నేహ పూర్వక వాతావరణంలో పెంచుతూ మొబైల్‌ ఫోన్లకు దూరంగా ఉంచాలన్నారు. ఆటలతో కూడిన విద్యను అందిస్తే ఆశించిన విజయాలు సాధించవచ్చన్నారు.

ఫాస్ట్‌ఫుడ్స్‌ తగ్గించి ఆకుకూరలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మహిళలు అత్యవర సమయంలో భయపడకుండా 100, 181, 1098 నంబర్లుకు ఫోన్‌ చేయాలన్నారు. పోషణ్‌ పక్వాడ కార్యక్రమాన్ని ఈ నెల 9 నుంచి 23 వరకు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీడీవో అధికారి రమేష్‌, తహసీల్దార్‌ చందన రేఖ, ఎంపీడీవో సత్యశ్రీనివాస్‌, నర్సీపట్నం, గొలుగొండ ఐసీడీఎస్‌ ప్రాజెక్టు అధికారులు రమణి, శ్రీగౌరీ, సూపర్‌వైజర్లు విజయకుమారి, నాగజ్యోతి, వెలుగు ఏపీఎం కనకరాజు, ఎంఎల్‌హెచ్‌్‌ పి.మౌనిక, హౌసింగ్‌ జేఈ జోగారావు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement