నోట్లో ఆకులు పెట్టుకుని నిరసన తెలుపుతున్న దృశ్యం
రాంబిల్లి(అచ్యుతాపురం): న్యాయం కోసం పోరాడుతున్న రాంబిల్లి మండలంలోని పంచదార్ల దళిత రైతులు ప్రారంభించిన దీక్ష గురువారం నాటికి 65వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా బాధిత రైతులతో పాటు సీపీఎం నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు. నోట్లో ఆకులు పెట్టుకుని తమ నిరసన వ్యక్తం చేశారు. వేరొక గ్రామ నిర్వాసితుల కోసం తమ భూముల్ని ఎటువంటి పరిహారం ఇవ్వకుండా తీసుకోవాలని ఉత్తర్వులు ఇవ్వడం అన్యాయమంటూ బాధిత రైతులు వాపోయారు. తుఫాన్ పరిహారం, రైతు భరోసా పొందిన భూముల్ని బలవంతంగా లాక్కోవాలని ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం దారుణంగా సీపీఎం నాయకులు దేవుడు నాయుడు, సోమునాయుడు అభివర్ణించారు. కార్యక్రమంలో గూటాల నాగఅప్పారావు, గుడబండి అప్పారావు, నాగప్పారావు, అబద్ధం, కనకరత్నం, లక్ష్మి, చిరంజీవి, రవి, అర్జున్‌రావు, నూకాలు తదితరులు పాల్గొన్నారు.


