ఆన్‌లైన్‌లో చందనోత్సవం టికెట్లు | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో చందనోత్సవం టికెట్లు

Apr 10 2026 9:57 AM | Updated on Apr 10 2026 9:57 AM

● 11 లేదా 12న అందుబాటులోకి తెస్తాం ● మూడు రోజుల్లో పనులన్నీ పూర్తి చేస్తాం ● కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌

సింహాచలం: సింహగిరిపై ఈ నెల 20న జరగనున్న చందనోత్సవాన్ని పురస్కరించుకుని.. టికెట్ల విక్రయాలను ఈ నెల 17వ తేదీలోపే ముగించేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ తెలిపారు. సింహగిరిపై జరుగుతున్న చందనోత్సవ ఏర్పాట్లను గురువారం కలెక్టర్‌ పరిశీలించగలరు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చందనోత్సవం టికెట్లను ఈ నెల 11 లేదా 12వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. టికెట్ల విక్రయాలను 17వ తేదీ నాటికే పూర్తి చేసి, మిగిలిన రెండు రోజులు కేవలం ఏర్పాట్లపైనే దృష్టి సారించేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. గతేడాది ఏర్పాట్లతో పోలిస్తే.. ఈసారి భక్తుల సౌకర్యార్థం శాశ్వత షెడ్లను అధికంగా అందుబాటులోకి తీసుకువచ్చామని, తాత్కాలిక కట్టడాలను తగ్గించామని కలెక్టర్‌ వివరించారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉత్సవానికి సుమారు 1.50 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని.. అందుకు తగ్గట్టుగా తాగునీరు, మరుగుదొడ్లు, క్యూల్లో రద్దీ నియంత్రణ వంటి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అవసరమైన చోట్ల ప్రత్యేక ర్యాంపులు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ.. మరో మూడు రోజుల్లో అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయని చెప్పారు. యంత్రాంగం ఎన్ని ఏర్పాట్లు చేసినా, భక్తుల సహకారం అవసరమన్నారు. పర్యటనలో భాగంగా కలెక్టర్‌ ఉచిత దర్శనం, రూ.300, రూ.1000, రూ.1500 దర్శన క్యూలను పరిశీలించారు. అన్నప్రసాద భవనం నుంచి పాదాలమ్మ, బంగారమ్మ ఆలయాల వద్దకు వెళ్లేందుకు ప్రతిపాదించిన ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి పనులను ప్రస్తుతానికి నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. చందనోత్సవంపై ఈ నెల 11న కలెక్టరేట్‌లో మంత్రులతో సమీక్ష సమావేశం ఉంటుందన్నారు. దేవస్థానం ఈవో జె.వెంకటరావు, ఈఈలు రమణ, రాంబాబు, రామకృష్ణ, డీఈలు హరి, తాతాజీ, ఏఈలు రవిరాజు, తిరుపతిరావు, పీఆర్వో అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement