దేవరాపల్లి: మండలంలో ఏఎంఆర్ సంస్థ పేరిట అక్రమంగా సీనరేజ్ వసూళ్లు చేస్తున్నారని గురువారం స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిల్లల మెట్ట క్వారీ నుంచి ఇళ్ల నిర్మాణానికి రాయిని తరలిస్తున్న ట్రాక్టర్ యజమానుల నుంచి అధిక సీనరేజ్ వసూలు చేయడంపై గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సదరు సంస్థ పేరిట వసూళ్లు చేస్తున్న వ్యక్తుల వద్ద కనీసం గుర్తింపు కార్డు లేకపోగా, రసీదులు చూపించకపోవడంతో ట్రాక్టర్ యజమానులు ఫిర్యాదు చేశారు. సీనరేజ్ పేరిట ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. వీరికి సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న మద్దతు పలికారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతున్న ఏఎంఆర్ సంస్థ దోపిడీకి పాల్పడుతుందని విమర్శించారు. గ్రామాల్లో ఎవరైనా ఇళ్లు నిర్మించుకుంటే గతంలో ట్రాక్టర్ మట్టికి రూ. 200 తీసుకునే వారని, ఏఎంఆర్ సంస్థ అక్రమంగా ట్రాక్టర్ మట్టికి రూ. 800 నుంచి రూ.వెయ్యి వసూలు చేస్తుందని ఆగ్రహించారు. గ్రామాల్లో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి ట్రాక్టర్లను వెంబడించి ఇష్టానుషారంగా వసూళ్లు చేయడం దుర్మార్గమన్నారు. గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదన్నారు. తక్షణమే పోలీసులు స్పందించి చర్యలు తీసుకోవాలని, లేకుంటే ట్రాక్టర్ల యజమానులు, భవన నిర్మాణ కార్మికులతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఫిర్యాదు చేసిన వారిలో గొర్లె దేముళ్లు, నమ్మి దేముళ్లు, సిహెచ్. అప్పారావు తదితరులు ఉన్నారు.


