ఎన్టీఆర్‌ ఆస్పత్రికి నిర్లక్ష్య సుస్తీ..! | - | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ ఆస్పత్రికి నిర్లక్ష్య సుస్తీ..!

Apr 5 2026 7:48 AM | Updated on Apr 5 2026 7:48 AM

పట్టిపీడిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది కొరత

సరిపడా మందుల్లేవు

వైద్య పరీక్షల కోసం గంటలపాటు క్యూలైన్‌లో పాట్లు

సిబ్బంది, నిర్వహణ లేక మూలన ఉన్న సిటీ స్కాన్‌ మిషన్‌

పట్టించుకునే నాథుడే కరవు

సాక్షి, అనకాపల్లి: జిల్లా కేంద్రం అనకాపల్లిలో గల ఎన్టీఆర్‌ ఆస్పత్రిలో సకాలంలో సక్రమంగా వైద్య సేవలు అందకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం, రెండు గంటల పాటు విద్యుత్‌ సరఫరాను నిలిపివేయడం, సకాలంలో వైద్యం అందకపోవడంతో ఈ ఆస్పత్రిలోని ఎన్‌ఎన్‌సీయూ వార్డులో చికిత్స పొందుతున్న మూడు రోజుల పసికందు ప్రాణాలు శుక్రవారం గాలిలో కలిసిపోయాయి. సకాలంలో వైద్య సేవలందని ఘటనలు తరచూ జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. గతంలో కూడా చాలాసార్లు విద్యుత్‌ సమస్యలతో ఆస్పత్రిలో అవుట్‌ పేషెంట్లు ఇబ్బందులకు గురయ్యారు. ఈ ఆస్పత్రికి అనకాపల్లి, చోడవర ం, మాడుగుల, పాయకరావుపేట, నర్సీపట్నం, యలమంచిలి నియోజకవర్గాల నుంచి వైద్యం కోసం రో గులు వస్తుంటారు. చంద్రబాబు ప్రభుత్వ పాలనలో ఆస్పత్రిలో సేవలు నానాటికీ తీసి కట్టుగా మారాయి. వైద్యులు లేరని సూపరింటెండెంట్‌ ప్రభుత్వానికి లేఖ రాసినా పట్టించుకున్న పాపాన పోలేదు.

ఇష్టారాజ్యం...

అడిగేవారే లేకపోవడంతో వైద్యులు, సిబ్బంది ఇష్టారాజ్యమైంది. చుట్టపుచూపుగా వచ్చిపోతున్నారన్న ఆరోపణలున్నాయి. ఆస్పత్రిలో తరచూ విద్యుత్‌ సరఫరా నిలిచిపోతుండడంతో రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. గత వారం రోజులుగా విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నా అధికారులు పట్టించుకోలేదు. జనరేటర్‌ సదుపాయం ఉన్నా..10 నిమిషాల పాటే పనిచేస్తుంది. మందుల కొరత, పారామెడికల్‌ సిబ్బంది కొరత పట్టిపీడిస్తోంది. గత ప్రభుత్వంలో కొనుగోలు చేసిన స్కానింగ్‌ యంత్రం నిర్వహణ ఖర్చులకు కూడా చంద్రబాబు సర్కార్‌ నిధులు కేటాయించలేదు.

ఓపీ ఫుల్‌... వైద్యం నిల్‌

జిల్లా ఆస్పత్రికి వచ్చే రోగులు సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రోజువారీ సగటున 500 నుంచి 600 వరకూ ఓపీ నమోదు అవుతోంది. వారికి తగ్గట్టుగా ఆస్పత్రిలో సదుపాయాలను మెరుగుపరచలేదు. వైద్యపరికరాలు, మందులు, వీల్‌చైర్లు, ఇతర మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉంది. వైద్యుల కొరత కారణంగా రోగులు గంటల తరబడి పడిగాపులు కాయవలసివస్తోంది. ఓపీలో చూపించుకుని వైద్యుడి సలహామేరకు వార్డులో చేరితే ఏమాత్రం ఎమర్జెన్సీఅయినా తక్షణమే కేజీహెచ్‌కి వెళ్లిపోవాలని రిఫర్‌ చేస్తున్నారు. గైనిక్‌ రోగులకు చిన్నపాటి ఎమర్జెన్సీ ఉన్నా కేజీహెచ్‌కు పంపుతున్నారు. ఆర్థిక స్థోమత ఉన్నవారు ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు.

నాడు చేసిన అభివృద్ధే...

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ‘నాడు–నేడు’లో భాగంగా ఎన్టీఆర్‌ ఆస్పత్రి ఆధునికీకరణ, మౌలిక వసతుల కల్పనకు రూ.1.5 కోట్లు మంజూరయ్యాయి. గత ప్రభుత్వంలో సీఎస్‌ఆర్‌ నిధులతో రూ.1.85 కోట్లతో సిటీస్కాన్‌ యంత్రం కొనుగోలు చేశారు.ఆ తరువాత ఆస్పత్రిలో జరిగిన అభివృద్ధి పనులు దాదాపు శూన్యమని చెప్పొచ్చు.

సిబ్బంది ఏరీ ?

నడవలేని స్థితిలో ఉన్న రోగులను తీసుకెళ్లేందుకు వీల్‌చైర్లున్నా వాటిని తోసేందుకు తగిన సిబ్బంది లేరు. దీంతో రోగి బంధువులే వార్డు బాయ్‌లుగా మారాల్సివస్తోంది. వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, వైద్య సిబ్బంది కొరత, తగిన మందులు, సౌకర్యాలు, వసతులులేక రోగులు ఇక్కట్లకు గురవుతున్నారు. ఏసీ సౌకర్యం లేకపోవడంతో స్కానింగ్‌, ఎక్స్‌రే యంత్రాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. ఆల్ట్రా స్కానింగ్‌ రూంలో ఒక్కరే రేడియాలజిస్టు అందుబాటులో ఉన్నారు. నెలవారీ చెకప్‌లో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన గర్భిణులను సైతం మూడు గంటలకు పైగా స్కానింగ్‌ సెంటర్ల వద్ద పడిగాపులుకాయాల్సి వస్తోంది. 42 మంది వైద్యులకు గాను 32 మాత్రమే అందుబాటులో ఉన్నారు. జనరల్‌ మెడిసిన్‌ విభాగంలో ముగ్గురికి గాను ఇద్దరు మాత్రమే ఉన్నారు. పీడియాట్రిక్‌ వైద్యులు ఒక్కరూ కూడా లేరు. ఎన్‌ఎన్‌సీయూ వార్డులో చిన్న పిల్లల వైద్యులు ఇద్దరు ఉండాలి, ప్రస్తుతం రెండు పోస్టులూ ఖాళీగా ఉన్నాయి. ఇద్దరు అనస్థీషియా వైద్యులకు గాను ఒకరు మాత్రమే అందుబాటులో ఉన్నారు. కంటి వైద్య నిపుణులు ఇద్దరికిగాను, ఒక్కరే ఉన్నారు. సైకియాట్రిస్ట్‌ వైద్యులు లేరు.స్టాఫ్‌ నర్సులు, పారామెడికల్‌ స్టాఫ్‌ 510 మంది ఉండాలి. వీరు రెండు షిఫ్ట్‌లలో విధులు నిర్వహించా లి. కానీ ప్రస్తుతం 215 మంది మాత్రమే పనిచేస్తు న్నారు. కాంట్రాక్ట్‌, రెగ్యులర్‌ స్టాఫ్‌ నర్సులు 56 మంది పనిచేస్తున్నారు. ఆస్పత్రిలో సర్జికల్‌ గ్లౌజులు, కాటన్‌, ఐవి క్యానల్‌, స్కానింగ్‌ జల్‌, కొన్ని రకాల సర్జికల్‌ పరికరాలు,ఫాంటాప్‌ ఇంజక్షన్‌ల కొరత ఎక్కువగా ఉంది.

జిల్లా కేంద్రం అనకాపల్లిలో గల ఎన్టీఆర్‌ ప్రభుత్వ ఆస్పత్రి పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో రోగుల సేవకు దూరమవుతోంది. ఇక్కడ సమస్యలు తిష్టవేశాయి. నిరుపేదలు వైద్య కోసం నానా అవస్థలు పడుతున్నారు. సకాలంలో వైద్యం అందకపోవడం..వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. తరచూ ఏదో ఒక వివాదంతో ఈ ఆస్పత్రి వార్తల్లో నిలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement